Share News

PM Modi: వరద పరిస్థితులపై మోదీ ఆరా..

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:21 AM

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు.

PM Modi: వరద పరిస్థితులపై మోదీ ఆరా..

  • సీఎం రేవంత్‌కు ఫోన్‌ చేసిన ప్రధాని, షా

  • హెలికాప్టర్లు పంపిస్తామని హామీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. తెలంగాణలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని మోదీ అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదలతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్‌ ప్రధానికి వివరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను, తీసుకున్న జాగ్రత్తలను తెలియజేశారు.


ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని రేవంత్‌ ప్రధానికి తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారని సీఎం కార్యాలయం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని మోదీ, అమిత్‌ షా తెలిపినట్లు సీఎంవో పేర్కొంది. వరద పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపింది.

Updated Date - Sep 02 , 2024 | 04:21 AM