Share News

లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:53 AM

ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భూసేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో అధికారులపై దాడి అనంతరం లగచర్ల, పరిసర గ్రామాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు

  • అదుపులోకి 55 మంది.. 16 మందికి రిమాండ్‌

  • లగచర్ల, మరో రెండు గ్రామాలు నిర్మానుష్యం

  • ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయున గ్రామస్థులు

  • కొడంగల్‌ నియోజకవర్గంలో ఇంటర్నెట్‌ బంద్‌

  • వికారాబాద్‌ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెన్‌డౌన్‌

  • రాజకీయ కుట్ర కోణంపై పోలీసుల దృష్టి

  • డీజీపీకి ఉద్యోగుల జేఏసీ నేతల ఫిర్యాదు

  • ‘లగచర్ల’ బాధ్యులను వదలం: శ్రీధర్‌బాబు

  • కలెక్టర్‌పై దాడి చేసినా ఊరుకోవాలా?: పొన్నం

  • విద్రోహ శక్తుల్లారా.. ఖబడ్దార్‌!

  • వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద జేఏసీ నేతల ధర్నా

కొడంగల్‌/బొంరా్‌సపేట్‌, వికారాబాద్‌, హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భూసేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో అధికారులపై దాడి అనంతరం లగచర్ల, పరిసర గ్రామాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. మంగళవారం లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లో నిర్మానుష్యం రాజ్యమేలింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా సోమవారం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూరు సబ్‌-కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయకుమార్‌, వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే..! అర్ధరాత్రి నుంచి పోలీసుల అరెస్టుపర్వం కొనసాగడంతో.. మంగళవారం ఈ మూడు గ్రామా ల్లో నిర్మానుష్యం రాజ్యమేలింది. ఇక్కడే ఉంటే.. దాడి తో సంబంధం లేకున్నా.. పోలీసులు అరెస్టు చేస్తారని, విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తారనే భయం తో పురుషులు.. ముఖ్యంగా యువకులు ఇతర ప్రాం తాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో.. ఈ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తప్పితే.. మంగళవా రం పురుషుల జాడ కనిపించలేదు. అర్ధరాత్రి నుంచే ఈ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.


రాజకీయ పరామర్శలు ప్రారంభమవ్వడంతో.. కొడంగ ల్‌ నియోజకవర్గంలో నెట్‌ సేవలను స్తంభింపజేశారు. అటు స్కూళ్లు కూడా పనిచేయలేదు. రోటిబండతండా, లగచర్లల్లో అంగన్‌వాడీ కేంద్రాలకూ తాళాలు కనిపించాయి. చాలా ఇళ్లకు తాళాలు ఉండడంతో సమగ్ర సర్వే కూడా జరగలేదు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో.. మీసేవ, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు సేవల్లో అంతరాయమేర్పడింది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు సోమవారం నాటి దాడిని ఖండిస్తూ పెన్‌డౌన్‌ నిర్వహించారు. కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దుద్యాల్‌ తహసీల్దార్‌ కార్యాలయాలకు తాళాలు వేసి, నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాలు పనిచేయకపోవడంతో.. అధికారులను కలిసేందుకు, వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు చెట్లకింద కూర్చుని ఎదురుచూడడం కనిపించింది.

  • వ్యూహాత్మకంగా అరెస్టులు..

దాడి నిందితులను గుర్తించి, అరెస్టు చే సేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సోషల్‌ మీడియా ఫొటోలు, వీడియోల ఆధారంగా నిందితుల ను గుర్తించారు. అర్ధరాత్రి మూడు గ్రామాల్లో విద్యు త్తు సరఫరా, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయించారు. ఇంటింటికీ ప్రత్యేకపోలీసు బలగాలతో వెళ్లి, 55 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే అధికారులు ఈ 55 మందిని విచారించారు. వారి సెల్‌ఫోన్లను విశ్లేషించారు. ఈ దాడితో ప్రమేయం లేదని భావించిన వారిని మధ్యాహ్నం 3 గంటల సమయంలో విడిచిపెట్టారు. అలా బయటకు వచ్చిన యువకులు లగచర్లకు నడుచుకుంటూ వచ్చా రు. వారిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా.. దాడి జరిగినప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు, సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోల్లో ఉన్నవారిపై మాత్రమే కేసులు నమోదు చేశారని చెప్పారు. పోలీసులు కూడా అరెస్టులపై మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న 16 మందిని కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.


  • రాజకీయ కుట్ర కోణం?

అధికారులపై దాడి వెనక రాజకీయ కుట్రకోణం ఉందా? అనే అంశంపైనా పోలీసులు దృష్టిసారించారు. నిజానికి ప్రజాభిప్రాయ సేకరణను లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అక్క డ అధికారులు టెంట్లు వేసి, రైతులు, ప్రజల కోసం ఎదురుచూశారు. వారు రాకపోగా.. లగచర్లకు చెందిన బొనగాని సురేశ్‌ అనే వ్యక్తి మరికొందరితో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైతులు భూములిచ్చేందుకు విముఖంగా ఉన్నారని, అంతా ఊళ్లోనే అందుబాటు లో ఉంటారని చెప్పారు. అధికారులు ఊళ్లోకి వస్తే.. సహాయం చేయడానికి తాము సిద్ధమని చెప్పారు. అయితే.. రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఊళ్లోకి వెళ్తే దాడి చేసే ప్రమాదముందని పోలీసులు హెచ్చరించారు. కలెక్టర్‌, ఇతర అధికారులు మాత్రం రైతులతో మాట్లాడేందుకు లగచర్లకు చేరుకున్నారు. అధికారుల ను చూస్తూనే గ్రామస్థులు కోపోద్రిక్తులై.. పెద్దపెట్టున నినాదాలిచ్చారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సురేశ్‌ అని పోలీసులు గుర్తించారు. అతడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అతణ్ని అరెస్టు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, దాడికి ముందు.. ఆ తర్వాత కూడా అతడి ఫోన్‌ నుంచి కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా రికార్డ్‌(సీడీఆర్‌) ద్వారా గుర్తించారు. దీనిపై పట్నం నరేందర్‌రెడ్డి స్పందిస్తూ.. సురేశ్‌ తన కు ఫోన్‌ చేసిన విషయం వాస్తవమేనని, భూసేకరణకు వచ్చిన అధికారులతో శాంతంగా మాట్లాడాలని సూచించినట్లు తెలిపారు. పార్టీ నేతలు.. కార్యకర్తలు తనకు ఎన్నిసార్లు ఫోన్‌ చేస్తే.. అన్నిసార్లు మాట్లాడతానని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. అధికారులపై దాడి వెనక రాజకీయ కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించి, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేందుకు లగచర్లలో అధికారులపై దాడి చేశారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.


  • వికారాబాద్‌ కలెక్టర్‌కు సీఎస్‌ ఫోన్‌

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి, తెలుసుకున్నారు. ఇతర ఐఏఎస్‌ అధికారులు కూడా ఆయనకు ఫోన్‌చేసి, సంఘీభావం తెలిపారు. అటు కలెక్టర్‌తోపాటు.. అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, కడా స్ఫెషలాఫీసర్‌ వెంకట్‌రెడ్డి,వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిని కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పరామర్శించారు.

  • 1,373 ఎకరాల్లో ఫార్మా కారిడార్‌

ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (క్లస్టర్‌ విలేజ్‌లు) ఏర్పాటు చేసేందుకు దుద్యాల మండలంలో లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, పులిచర్ల తండా, రోటిబండ తండాల పరిధిలో 1,373 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఇందులో 547 ఎకరాల అసైన్డ్‌ భూములు, 90 ఎకరాల ప్రభుత్వ భూములు పోగా.. 736 ఎకరాలు పట్టా భూములను సేకరించాల్సి ఉంది. 580 మంది రైతులకు చెందిన 632.26 ఎకరాల్లో భూసేకరణ చేపట్టేందుకు అధికారులు ఆగస్టు నెలలో నోటిఫికేషన్‌ జారీ చేశారు. హకీంపేట్‌లో 366.34 ఎకరాలు, పోలేపల్లిలో 130.21 ఎకరాలు, లగచర్లలో 156.05 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదనలు చేశారు.


  • డీజీపీకి ఉద్యోగుల జేఏసీ ఫిర్యాదు

లగచర్లలో అధికారులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి, మరో జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో డీజీపీకి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. అనంతరం సచివాలయంలో లచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడి జరిగితే నోరుమెదపని వారు.. నిందితుల అరెస్టులను ఖండించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లగచర్లలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొందరు వ్యక్తు లు రైతుల ముసుగులో అధికారులపై దాడి చేశా రని ఆరోపించారు. జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ దాడి ఉద్యోగులపై జరిగింది కాదని, వ్యవస్థపై జరిగిందని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పథకం ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని ఆరోపించారు. బాధిత ఉద్యోగులకు న్యాయం జరగని పక్షంలో.. 206 సంఘాలు, పదిలక్షల మంది ఉద్యోగులతో జేఏసీ నేతృత్వంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

Updated Date - Nov 13 , 2024 | 03:54 AM