Share News

Vikarabad: బ్రాంచ్‌ మేనేజరే ప్రధాన నిందితుడు

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:21 AM

వికారాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్యాంకు కేసును పోలీసులు ఛేదించారు. బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డ బ్యాంకు మేనేజరే ప్రధాన నిందితుడని తేల్చారు.

Vikarabad: బ్రాంచ్‌ మేనేజరే ప్రధాన నిందితుడు

  • రూ.1.24 కోట్లతో పరారైన వ్యక్తి అరెస్టు

  • ‘మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్యాంకు’ కేసును ఛేదించిన వికారాబాద్‌ పోలీసులు

వికారాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్యాంకు కేసును పోలీసులు ఛేదించారు. బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డ బ్యాంకు మేనేజరే ప్రధాన నిందితుడని తేల్చారు. బంగారు ఆభరణాలు కుదువపెట్టే వారిలో 20 మంది కస్టమర్ల పైన 63 నకిలీ ఇన్వెంటరీ ఐడీలు సృష్టించి ఏకంగా రూ. 1.24 కోట్లు కాజేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా ఔరాద్‌ తాలూకా నారాయణపూర్‌ గ్రామానికి చెందిన విశా ల్‌ వికారాబాద్‌ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్‌ (గోల్డ్‌ లోన్‌) లిమిటెడ్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.


అక్టోబరు 10న వికారాబాద్‌ బ్రాంచ్‌లో కుదువ పెట్టిన బం గారు ఆభరణాలను ఆడిటర్‌ తన బృందంతో కలిసి తనిఖీ చేయగా, ఒక బంగారం ప్యాకెట్‌ తక్కువ వచ్చింది. దీంతో సంస్థ రీజినల్‌ మేనేజర్‌ రవీంద్ర కుమార్‌ అదేనెల 17న మణప్పురం బ్రాంచ్‌కు వెళ్లగా.. అక్కడ మేనేజర్‌ విశాల్‌ అందుబాటులో లేడు. అతడికి ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఆడిటింగ్‌ బృందం, ఇతర సిబ్బందితో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌లో పరిశీలించగా 2,944.226 గ్రాముల 63 బంగారం నగల ప్యాకెట్లు కనిపించలేదు. దీంతో విశాల్‌ నగలను దొంగతనం చేశాడని అనుమానించారు.


విశాల్‌కు అక్కడ పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్లు శివప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి ఆడిటర్‌ రాజ్‌కుమార్‌లు సహకరించారని తెలుసుకున్న ఆర్‌ఎం రవీంద్రకుమార్‌ ము గ్గురిపై వికారాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, సీసీఎస్‌ సీఐ బలవంతయ్య ఆధ్వర్యంలో ప్ర త్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం విశాల్‌ను తన సొంత గ్రామమైన నారాయణపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. బంగారం కుదవపెట్టకుండానే నకిలీ ఐడీలు సృష్టించి బ్యాంకు డబ్బు ను కాజేసినట్లు తేలింది. నిందితుడి నుంచి 83 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 05:21 AM