TG: అనర్హత పిటిషన్ల నెపంతో రాజకీయం: పాడి కౌశిక్ రెడ్డి.
ABN , Publish Date - May 01 , 2024 | 04:14 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను సమర్పించే నెపంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ చేసింది ఇదే
స్పీకర్‌కు పిటిషన్ సమర్పించి పది రోజులైనా కాలేదు
ఇంతలోనే హైకోర్టును ఆశ్రయించడంతోనే వారి కుట్ర వెల్లడి
దానం, తెల్లం, కడియంపై అనర్హతపై స్పీకర్‌కు ఆదేశాలివ్వాలన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఏజీ వాదన
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను సమర్పించే నెపంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. మీడియా దృష్టిని ఆకర్షించడానికే వారు మద్దతుదారులను వెంటేసుకొని స్పీకర్ కార్యాలయానికి వెళ్లారని చెప్పారు. అందుకే స్పీకర్ వారిని కలవలేదని, కుట్రను తిప్పికొట్టారని పేర్కొన్నారు.
స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లను సమర్పించి పది రోజులైనా గడవకముందే హైకోర్టును ఆశ్రయించారని, దీన్ని బట్టే కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కుట్ర అర్థం అవుతోందని వాదించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయడంతో పాటు తమ పిటిషన్లను స్వీకరించేలా స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలన్న పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీలైనంత వేగంగా, 3 నెలలకు మించకుండా అనర్హత పిటిషన్లను పరిష్కరించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ పిటిషనర్లు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌లు స్పీకర్ కార్యాలయానికి చేరాయని, రశీదులు కూడా జారీ అయ్యాయని నివేదించారు.
విచారణకు స్పీకర్‌కు తగిన సమయం ఇవ్వాలని, పిటిషన్లను కొట్టేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దానం తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, ఈసీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.