Ponguleti : కొత్త చట్టంతో సామాన్యులకు మేలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:35 AM
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి.. కబ్జాలకు అవకాశమివ్వొద్దు
జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై కేసులు!
తహసీల్దార్లతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సామాన్యులకు మేలు చేసేలా కొత్త చట్టం
రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కేంద్రం
కలెక్టర్ అనుమతి తీసుకున్న తహసీల్దార్లపై కేసులు!: పొంగులేటి
హైదరాబాద్/మేడ్చల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తామని తెలిపారు. సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. శామీర్‌పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఆదివారం 33 జిల్లాల తహసీల్దార్లతో మంత్రి శ్రీనివాసరెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెడ్ల వంటి వారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలను కాపాడడంతోపాటు పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని సూచించారు.
ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. ఇందుకోసం పటిష్ఠ కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించాలి, వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పథకాలను అందించడంలోనూ రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలన్నారు. అందులో తహసీల్దార్ల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య రెవెన్యూ శాఖ వారధిగా ఉండాలని, ఈ విభాగం సమర్థంగా పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరతాయని తెలిపారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా, లేదా? అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు.
రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు సాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రెవెన్యూ శాఖలో ఎంత నిజాయితీగా పనిచేసినా నిందలు తప్పవని, మన అంతరాత్మ సాక్షిగా పనులు చేయాలని సూచించారు. కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే తహసీల్దార్ల మీద కేసులు నమోదు చేసేలా డీజీపీతో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
గత ప్రభుత్వం హడావుడిగా మండలాల సంఖ్యను పెంచింది కానీ, దానికి తగినట్టుగా కార్యాలయాలను, మౌలిక వసతులను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అవసరమైన మేరకు సిబ్బందిని కూడా నియమించలేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్ నియామకం, పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, అద్దె వాహన బకాయిలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో జరిగిన తహసీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
28 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కార్యక్రమం చూడలేదు: నవీన్ మిట్టల్
తన 28 ఏళ్ల సర్వీసులో రెవెన్యూ మంత్రి తహసీల్దార్లతో ముఖాముఖిగా మాట్లాడడం ఇదే తొలిసారి అని ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ శాఖలు చేయలేని పనులను రెవెన్యూ శాఖ చేస్తుందని చెప్పారు. రెవెన్యూ అధికారుల సమస్యలను వినడానికి, వాటికి తగురీతిలో పరిష్కరించడానికి మంత్రి రావడం హర్షణీయమని తెలిపారు.