Share News

Yadadri: కీలక దశకు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - May 16 , 2024 | 04:05 AM

ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్‌) మంగళవారం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్‌కో అధికారులు అక్టోబర్‌ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్లాంటు వద్దే సమీక్ష నిర్వహించి అక్టోబర్‌ నాటికి మొదటి రెండు యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి జెన్‌కో యంత్రాంగం పనులను వేగంగా కొనసాగిస్తోంది.

Yadadri: కీలక దశకు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌

  • బాయిలర్ల ’లైటప్‌’ విజయవంతం

  • అక్టోబరు 10 నాటికి 2 యూనిట్లలో విద్యుదుత్పాదన లక్ష్యంగా పనులు

  • ప్లాంటుకు బొగ్గు ఇల్లెందు గనుల నుంచే

హైదరాబాద్‌/నల్లగొండ, మే 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్‌) మంగళవారం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్‌కో అధికారులు అక్టోబర్‌ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్లాంటు వద్దే సమీక్ష నిర్వహించి అక్టోబర్‌ నాటికి మొదటి రెండు యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి జెన్‌కో యంత్రాంగం పనులను వేగంగా కొనసాగిస్తోంది. ప్లాంటు వద్దకు బొగ్గు రవాణాకు విష్ణుపురం నుంచి నిర్మిస్తున్న రైల్వే లైన్‌ పనులు చివరి దశకు చేరాయి. 2025 ఫిబ్రవరికల్లా మొత్తం 5 యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకొంది.


బొగ్గు రవాణా భారమే

దేశవ్యాప్తంగా పిట్‌హెడ్‌ (బొగ్గు గని ఉపరితల భాగంలో) విధానంలోనే థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లు నిర్మిస్తుండగా... యాదాద్రి ప్లాంట్‌ను మాత్రం నాన్‌ పిట్‌హెడ్‌ (బొగ్గు గనులకు దూరంగా) విధానంలో నిర్మిస్తున్నారు. ప్లాంటుకు 179 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఇల్లెందు గనుల నుంచి బొగ్గు తరలించనున్నారు. దీంతో బొగ్గు రవాణా ఖర్చు పెరిగి, ప్రతీ యూనిట్‌ కరెంట్‌పై రూపాయి దాకా అదనపు భారం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ ప్లాంట్‌ను రూ.25,099 కోట్లతో ప్రతిపాదించగా, సవరించిన అంచనా వ్యయం రూ.34,543 కోట్లకు పెరిగింది. నిర్మాణం పూర్తయ్యేలోపు మరో రూ.5 వేల కోట్లు పెరగొచ్చని అంచనా. బొగ్గు రవాణా ఖర్చు, పెరిగిన అంచనా వ్యయంతో యూనిట్‌ కరెంటు రేటు రూ.6.50-రూ.7 దాకా పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.


ఇంటికో ఉద్యోగం హామీ నెరవేర్చాలి

ఇంటికో ఉద్యోగంతోపాటు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్లాంటునిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 1,560 కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. కపూర్‌తండా, మోదుగులకుంట తండా గ్రామస్థుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస గ్రామాల్లో మౌలిక వసతుల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌ ప్రారంభోత్సవంలోపైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 04:05 AM