Share News

Harish Rao: మానవతా మూర్తి.. మరిక సెలవు

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:02 AM

పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు,

Harish Rao: మానవతా మూర్తి.. మరిక సెలవు

  • ప్రొఫెసర్‌ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు

  • వేలాది మందితో జవహర్‌నగర్‌ జన సంద్రం

  • గన్‌పార్క్‌లో నివాళులకు అనుమతి నిరాకరణ

  • భౌతికకాయం.. గాంధీ మెడికల్‌ కాలేజీకి

హైదరాబాద్‌ సిటీ/మల్కాజిగిరి/మంగళ్‌హాట్‌/అడ్డగుట్ట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు తదితర రంగాల ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి కడసారిగా నివాళులర్పించారు. ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు నిమ్స్‌ ఆస్పత్రి నుంచి గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్థూపం వద్దకు తీసుకెళ్లారు. అయితే, భౌతిక కాయాన్ని అక్కడ ఉంచడానికి వీల్లేదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు.


తెలంగాణ పోరాటంలో మమేకమైన వ్యక్తులు మరణించినప్పుడు గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన సందర్భాలున్నాయని.. అయినా, పోలీసులు సాయిబాబా భౌతిక కాయాన్ని అనుమతించకపోవడం ఏంటని ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భౌతిక కాయాన్ని మౌలాలి జవహర్‌నగర్‌లోని సాయిబాబా సోదరుడి నివాసానికి తరలించారు. అక్కడ వేలాది మంది సాయిబాబా భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం 3 గంటలకు జవహర్‌నగర్‌ నుంచి ర్యాలీగా సాయిబాబా భౌతిక కాయాన్ని తీసుకొచ్చి గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.


  • నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు: హరీశ్‌ రావు

నిర్దోషిగా బయటకు వచ్చిన సాయిబాబా స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించేలోపే మరణించడం బాధాకర మని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దశాబ్ద కాలం ఆయన అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారని, ఆయన జీవితంలో విలువైన ఆ సమయాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరని అన్నారు. సాయిబాబాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సుప్రీం సీజే చంద్రచూడ్‌కు లేఖ రాశానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. కోర్టులో కేసు కూడా వేస్తామని ప్రకటించారు. సాయిబాబాది ప్రభుత్వ హత్యేనని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. సాయిబాబా మరణానికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.


  • పలువురు ప్రముఖుల నివాళి..

సాయిబాబా భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ నేత కే. కేశవరావు, కవయిత్రి జయప్రభ, జనశక్తి నేత అమర్‌, విమలక్క, మానవ హక్కుల నేత జీవన్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్టు కే. రాంచంద్రమూర్తితో పాటు పలువురు నేతలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి నేతలు సాయిబాబా భౌతిక కాయానికి అంజలి ఘటించారు.


  • కేటీఆర్‌కు నిరసగ సెగ

సాయిబాబాకు నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌కు పౌర హక్కుల నేతల నుంచి నిరసన సెగ తగిలింది. కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ వారు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో ఉపా కేసులు పెట్టినా.. ఏనాడూ మాట్లాడని అప్పటి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వచ్చి సాయిబాబకు నివాళులు అర్పించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కారణమో బీఆర్‌ఎస్‌ సర్కారూ అంతే కారణమంటూ నినాదాలు చేశారు.

  • నిరంకుశ పాలనపై నైతిక గెలుపు..

- ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే. శ్రీనివాస్‌

నిరంకుశ పాలనలో జైలులో నరక యాతన అనుభవించి నిర్దోషిగా బయటకు వచ్చిన సాయిబాబా మరణం సమాజానికి తీరని లోటు. చనిపోయినా.. నైతిక విజయం ఆయనదే. ఆయన చాలా చెప్పాలనుకున్నారు. జీవితం గురించి, అనుభవించిన కష్టాల గురించి, సమాజం గురించి ఎంతో చెప్పాలనుకున్నారు. అంతలోపే ఆయనను మరణం తీసుకెళ్లింది. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.


  • రాకకోసం ఎదురుచూసినంత సేపు పట్టలేదు

- వసంత, సాయిబాబా జీవిత సహచరి

సాయిబాబా రాక కోసం ఎదురుచూసినంత సేపు పట్టలేదు.. మమ్మల్ని వదిలి దూరమవడానికి. ఏడు నెలల కిందట జైలు నుంచి విడుదలైనా, ఆయన్ను కంటి నిండా చూసుకున్నది లేదు. మనసు విప్పి మాట్లాడుకున్నది లేదు. ఢిల్లీలో ఉన్నన్నాళ్లు రోజూ ఉదయాన్నే ఫిజియోథెరపీకి వెళ్లి రావడం. బంధుమిత్రులు, ఉద్యమ సహచరుల పలకరింపులు, ఫోన్‌ పరామర్శలతో రోజంతా తీరిక లేకుండా గడిచేది. హైదరాబాద్‌ వచ్చాక ఆస్పత్రిలోనే ఎక్కువ సమయం అయిపోయింది. ఇలా జరుగుతుందని ఊహించలేదు.


  • నాన్నతో ఎన్నో మాట్లాడాలనుకున్నా

- మంజీర, సాయిబాబా కుమార్తె

నాన్నతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఎక్కవ. జైలు నుంచి విడుదలైన తర్వాత నాన్నతో జీవితాంతం కలిసి ఉండొచ్చని అనుకున్నాను. చనిపోవడానికి వారం ముందు నుంచి ఆయన తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారు. అయినా, పుస్తకాలు చదివారు. ఆస్పత్రి గదిలోనూ సగంపైగా పుస్తకాలే. నాన్నతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఆయన ఇంత తొందరగా దూరమవుతారని అనుకోలేదు.


  • ఆదివాసీల హక్కుల గొంతుక

  • పౌర హక్కుల నేతగా జీవితమంతా పోరాటం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘ఆయన జీవితమే పోరాటం’.. ఈ మాటకు నిలువెత్తు ప్రతి రూపం ప్రొఫెసర్‌ సాయిబాబా. అడుగుతీసి అడుగు వేయలేడు. అయినా అడుగు ఎలా వేయాలో.. ఎటు వైపు వేయాలో తెలిసిన మానవతామూర్తి. కడుపులో చల్లకదలకుండా బతికే ప్రభుత్వ కొలువు ఉన్నా.. జీవించినంత కాలం బలహీనుల పక్షాన గొంతెత్తారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేసి ఆదర్శమూర్తిగా నిలిచారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సాయిబాబా విద్యార్థి దశలోనే ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. అమలాపురంలోని మిషనరీ స్కూల్లో పదో తరగతి చదువుతుండగా.. ఒక రోజు సాయిబాబా సహాధ్యాయులతో కలిసి సమీపంలోని ఆదివాసీ గూడేనికి వెళ్లారు. అదే సమయంలో ఆదివాసీల హక్కుల మీద అవగాహన కల్పించడానికి అక్కడికి వెళ్లిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ఆంగ్ల ప్రసంగాన్ని సాయిబాబా తెలుగులోకి అనువదించారు. అందుకు మెచ్చిన శర్మ కొన్ని పుస్తకాలను సాయిబాబాకు బహూకరించారు. అలా బీడీ శర్మ పరిచయంతో ఆదివాసీ హక్కుల ఉద్యమంతో సాయిబాబాకు అనుబంధం ఏర్పడింది. సల్వాజుడుం, గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా ‘ఫోరం ఎగెనెస్ట్‌ వార్‌ ఆన్‌ పీపుల్‌’ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గళమెత్తారు. ఒక సందర్భంలో ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లారు.


  • తెలంగాణ పోరాటంలో పాత్ర..

తెలంగాణ మలి దశ పోరాటానికి ముఖ్య భూమికగా నిలిచిన 1997 నాటి వరంగల్‌ డిక్లరేషన్‌ సభలో సాయిబాబా ముఖ్య పాత్ర పోషించారు. తెలంగాణ సాధన లక్ష్యంగా అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక(ఏఐపీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో 1997 డిసెంబరు 28, 29 తేదీల్లో వరంగల్‌ వేదికగా పెద్ద సదస్సు జరిగింది. ప్రజాకవి కాళోజీ అధ్యక్షతన సాగిన సదస్సులో ఆ సంస్థ జాతీయ కార్యదర్శిగా సాయిబాబా కీలకపాత్ర పోషించారు. మండల్‌ కమిషన్‌ మద్దతు ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు.


  • బోధనా రంగంపై మక్కువ..

ప్రొఫెసర్‌ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ ఆనంద్‌ కళాశాలలో 2014, మే 9 ముందు వరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంగ్ల సాహిత్యంలో సాధికారత కలిగిన సాయిబాబా ప్రధానంగా ఆంగ్ల సాహిత్య సిద్ధాంతం, చరిత్ర, యూరోపియన్‌ మోడ్రన్‌ డ్రామా సబ్జెక్టులను బోధించారు. ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సోమవారం సాయిబాబా అంతిమయాత్రకు హాజరయ్యారు. బోధనా రంగాన్ని అమితంగా ప్రేమించిన సాయిబాబాను 2021, ఏప్రిల్‌లో ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. ఆయన నిర్దోషిగా విడుదలైన తర్వాత తిరిగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు ప్రయత్నించారు. వైస్‌ చాన్స్‌లర్‌ను సైతం కలిశారు. అది తమ చేతిలో లేదని అవతలి నుంచి సమాధానం రావడంతో మరో న్యాయపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే ఆయన కన్నుమూశారు.

Updated Date - Oct 15 , 2024 | 04:05 AM