Hyderabad: రెండు ముక్కలుగా ‘రెవెన్యూ’?
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:26 AM
రెవెన్యూ శాఖను రెండుగా విభజించి.. సాధారణ పాలన, భూపరిపాలన అనే వేర్వేరు విభాగాలుగా విడగొట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
వేర్వేరు విభాగాలుగా భూపరిపాలన, సాధారణ పాలన!.. భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖను రెండుగా విభజించి.. సాధారణ పాలన, భూపరిపాలన అనే వేర్వేరు విభాగాలుగా విడగొట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ శాఖను విభజించడం ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా.. రెవెన్యూకు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో కలిపేసి.. ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు, ప్రొటోకాల్ వంటి కార్యక్రమాలను రెవెన్యూలోనే సాధారణ పాలనా విభాగానికి అప్పగించాలంటూ వస్తున్న సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇలా చేయడం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడంతోపాటు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని, పని విభజన చేయడం ద్వారా రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని కొంత మంది రెవెన్యూ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఉదాహరణకు.. మండల తహసీల్దారు కార్యాలయంలో భూసంబంధిత పాలనకు ఒక అధికారిని, అభివృద్ధి, సంక్షేమం ఇతర కార్యక్రమాలకు మరో అధికారిని కేటాయించడం ద్వారా ఇద్దరు తహసీల్దార్లతో మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు.. ఆర్‌ఐ నుంచి ఆర్డీవో వరకు.. ఎన్నికలు వచ్చినా, విపత్తులు, జనాభా లెక్కలు, తనిఖీలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రొటోకాల్.. ఇలా అన్నీ రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే జరుగుతున్నాయి.
దీంతో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, సేవలు ఆలస్యమవుతున్నాయనే విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాల మధ్య నేటికీ సమన్వయం లేదు. రెవెన్యూలో మ్యుటేషన్ పెండింగ్ ఉన్నా రిజిస్ట్రేషన్ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల కొన్ని కేసుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. ఉన్నత స్థాయిలోనూ రెవెన్యూకు, రిజిస్ట్రేషన్ విభాగాలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉన్నారు. అవసరం లేకపోయినా ఇది కొనసాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. కాగా.. 2014లో ప్రపంచ బ్యాంకు ల్యాండ్ గవర్నెన్స్ అసె్‌సమెంట్ ఫ్రేమ్ వర్క్ కింద నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల్లో.. భూపాలన కోసం, భూదస్త్రాల నిర్వహణకు ఏకీకృత భూపరిపాలనా వ్యవస్థను తీసుకురావాలని పేర్కొంది.
అవగాహన ఉన్న అధికారులేరీ?
మండల స్థాయి రెవెన్యూ అధికారుల్లో చాలా మంది పదోన్నతుల ద్వారా జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకుంటున్నారు. దీనివల్ల వారికి రెవెన్యూ చట్టాల మీద సరైన అవగాహన.. న్యాయపరమైన చిక్కులు ఎదురైతే వాటిని అధిగమించేందుకు తగిన పాలనా నైపుణ్యం, అర్హతలు లేకపోవడం వల్ల.. కోర్టు కేసులు, భూ సమస్యలు పెరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తహసీల్దారుగా పని చేసే వ్యక్తికి న్యాయపరమైన అవగాహన కూడా ఉండాలనే నిబంధన పెట్టి.. భూచట్టాలపై సమగ్ర అవగాహన ఉండే వ్యక్తులను నియమిస్తే చాలా వరకు భూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలను కొంత మంది ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.