Medical College: నల్లగొండ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ?
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:45 AM
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
జూనియర్ డాక్టర్ సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు
నల్లగొండ రూరల్, నవంబరు 16 (ఆంరఽధజ్యోతి): నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. కేరళకు చెందిన జూనియర్ విద్యార్థులను 15 రోజుల క్రితం పలువురు ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు ఈ నెల 12న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తమతో ఇబ్బందికరమైన రీతిలో మాట్లాడుతూ, చెప్పిన పని చేయమని వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఓ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్ చేశారంటూ జిల్లా కలెక్టర్, వైద్య విద్య సంచాలకులకు నివేదిక ఇచ్చింది. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన 2020 బ్యాచ్‌కి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను ఆరు నెలలు, 2023 బ్యాచ్‌కి చెందిన మరో విద్యార్థికి ఒక నెల, జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిని ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.