Share News

Aerospace Industry: రూ.300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్‌

ABN , Publish Date - Nov 22 , 2024 | 03:01 AM

రఘువంశీ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ.. రూ.300 కోట్లతో శంషాబాద్‌ ఏరోస్పేస్‌ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.

Aerospace Industry: రూ.300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్‌

  • శంషాబాద్‌ ఏరోస్పేస్‌ పార్కులో ఏర్పాటు

  • బోయింగ్‌, ఎయిర్‌బస్‌ విడిభాగాల తయారీ

  • శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్‌బాబు

  • మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రఘువంశీ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ.. రూ.300 కోట్లతో శంషాబాద్‌ ఏరోస్పేస్‌ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కొత్త కర్మాగారం నిర్మాణానికి గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా రాబోయే మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. రఘువంశీ ఏరోస్పేస్‌ వద్ద ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన కర్మాగారంలో ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఎయిర్‌బస్‌ ఏ320, బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల ఇంజన్లతోపాటు ఇతర అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని వెల్లడించారు. 2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ సంస్థ.. ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్‌ పంపులు, ల్యాండింగ్‌ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. ఏరోస్పేస్‌ రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసిందన్నారు.


ఈ కంపెనీ డీఆర్‌డీవో, ఇస్రో, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని.. ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు అవసరమైన పరికరాలతో పాటు ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలనూ తయారు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఏరోస్పేస్‌ సెజ్‌లో టాటా, భారత్‌ ఫోర్డ్‌, అదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడా వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయా రు చేస్తున్నాయని శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ఏరోస్పేస్‌ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 ఎంఎ్‌సఎంఈలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎ్‌సఎంఈ విధానం ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ వంశీ వికాస్‌, డీఆర్‌డీవో డైరెక్టర్‌ రాజబాబు, సీఐఐ చైర్మన్‌ సాయి ప్రసాద్‌, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 03:01 AM