Share News

తాజా సీఎం, మాజీ సీఎంకు చురకలంటించిన రఘునందన్

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:16 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లపై మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం మెదక్‌లో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వేర్వేరు కాదన్నారు. వారిద్దరు వీణా వాణిలాగా అవిభక్త కవలలని అభివర్ణించారు. కేసీఆర్ తీసుకు వచ్చిన జీవో 51ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

తాజా సీఎం, మాజీ సీఎంకు చురకలంటించిన రఘునందన్
Raghunandhan rao

మెదక్, ఏప్రిల్ 27: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లపై మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం మెదక్‌లో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వేర్వేరు కాదన్నారు. వారిద్దరు వీణా వాణిలాగా అవిభక్త కవలలని అభివర్ణించారు. కేసీఆర్ తీసుకు వచ్చిన జీవో 51ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.


గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందంటూ సీఎం రేవంత్ అంటున్నారన్నారు. అలాగే బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తోందని రేవంత్ చెబుతున్నారని చెప్పారు. 10 ఏళ్లుగా మోదీ అధికారంలో ఉన్నారని.. ఆ సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేయలేదని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అయితే రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరణ చేశారో తాను చర్చకు సిద్దమని.. మీరు సిద్దామా? అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రఘునందన్ రావు సవాల్ విసిరారు.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. జై శ్రీరాం అంటే ఏమైనా తప్పా.. జై కేసీఆర్ అనమని చెబుతావా? అంటూ బీఆర్ఎస్ అధినేతపై రఘునందనరావు తనదైన శైలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


హిందూ గాళ్లు.. బొందు గాళ్ళు అంటేనే నీ బిడ్డను ఓడగొట్టారని కేసీఆర్‌కు ఈ సందర్బంగా పేర్కొన్నారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? అని కేసీఆర్ అంటున్నారని.. మరి అయిదు సార్లు నమాజు చదివితే కడుపు నిoడుతుందా? అని వ్యంగ్యంగా రఘునందన్ రావు ప్రశ్నించారు.


యజ్ఞాలు, యాగాలు చేసి ప్రసాదం తీసుకోమంటవు కదా? అంటూ కేసీఆర్‌కు రఘునందన్ రావు చురకలంటించారు. సోనియా, రాహుల్ గాంధీని ఈడీ అరెస్ట్ చేయలేదంటే.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనా? అని రేవంత్, కేసీఆర్‌లను సూటిగా ప్రశ్నించారు. బిజెపి వస్తే రిజర్వేషన్‌లు పోలేదు.. వచ్చాయన్నారు. అలాగే ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చబోరని రఘునందనరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 05:16 PM