Share News

BRS: రుణమాఫీ కాలేదనే రాహుల్ రాలేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:03 PM

కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాలేదని విమర్శించారు.

BRS: రుణమాఫీ కాలేదనే రాహుల్ రాలేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి ఎప్పుడైనా తీర్పు రావొచ్చని తెలిపారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదనేది ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్(CM Revanth Reddy) అబద్దం చెప్పారని మండిపడ్డారు. స్టేషన్ ఘనపూర్‌కి త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని.. అక్కడి నుంచి బీఆర్ఎస్ నేత రాజయ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. . స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం కావ్య, శ్రీహరిని ప్రజలు త్వరలోనే నిలదీస్తారని హెచ్చిరించారు.


"ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై హైకోర్టుకు వెళ్ళాం. మిగతా వారిపై కూడా సుప్రీంకోర్టుకు వెళతాం. అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. నేతలు, కార్యకర్తలు బాధపడాల్సిన పనిలేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు. సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల పాలనలో రాష్ట్రంలో కరెంట్ మాయమైంది. కేసిఆర్ పాలనలో కరెంట్ పోతే వార్త, రేవంత్ పాలనలో కరెంట్ ఉంటే వార్త. ఊసరవెల్లులు పాలన చేస్తే తొండలు, బల్లుల వల్ల కూడా కరెంట్ పోతుంది. నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. కాంగ్రెస్ నిజస్వరూపం తెలంగాణ యువతకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.

జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇస్తోంది. ఆగస్టు 15 వచ్చినా రెండు లక్షల రుణమాఫీ కాలేదు. అందుకే రాహుల్ గాంధీ రమ్మన్నా రావడం లేదు. రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇవ్వరు. ఆసరా రూ.4 వేలు పెంచుతాం అని మాట తప్పారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అని విమర్శలు చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రేవంత్ రేవంత్ సోదరులే కనిపిస్తున్నారు. ఇది కుటుంబ పాలన కాదా? కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలి. లేదంటే ప్రజల్లోనే వారి వైఫల్యాలను ఎండగడతాం. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి రూ. వెయ్యి కోట్ల టెండర్ ఇచ్చారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ మాట్లాడుతున్నారు. ఇలా అబద్ధాలు చెబితే ఎవరైనా నమ్ముతారా? 2019లోనే మా సర్కార్‌తో కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకుంది. కాగ్నిజెంట్‌ను కాంగ్రెస్ తీసుకొచ్చినట్లుగా కవరింగ్ ఇస్తున్నారు. మాయ మాటలు, స్టంట్లతో ప్రభుత్వం ఎక్కువ రోజులు నడపలేరు" అని కేటీఆర్ పేర్కొన్నారు.


బీజేపీతో సంబంధాలపై..

"2014లో కాంగ్రెస్ సర్కార్ మాకు రాష్ట్రాన్ని అప్పజెప్పిన నాటికి తెలంగాణ రూ.300 కోట్ల రెవెన్యూ మిగులు రాష్ట్రం. 2023లో మేము తిరిగి రాష్ట్రాన్ని అప్పగించే నాటికి రూ.5 వేల 900 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది. అప్పులు చేస్తే రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఎలా ఉంటుంది. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకోవడానికి మాకేం ఖర్మ. మాకు ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడ బిడ్డ ఇన్ని రోజులు జైలులో ఉంటుందా. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు అవుతుంది. త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లో శిక్షణ తరగతులు పెడతాం. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్ట్‌ను రేవంత్ తానే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ స్టంట్లతో ప్రజలను మోసం చేయలేరు" అని కేటీఆర్ అన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 04:11 PM