Rahul Gandhi: 5న రాష్ట్రానికి రాహుల్
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:10 AM
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈనెల 5న రాష్ట్రానికి రానున్నారని, బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కుల గణనపై మేధావులు, పౌర హక్కు లు, విద్యార్థి, కుల సంఘాల నేతలతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
కుల గణనపై సమావేశానికి హాజరు
ఖర్గే కూడా పాల్గొనే అవకాశం
6 లేదా 7న అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈనెల 5న రాష్ట్రానికి రానున్నారని, బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కుల గణనపై మేధావులు, పౌర హక్కు లు, విద్యార్థి, కుల సంఘాల నేతలతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తాను, సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకే ఆయన వస్తున్నారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనూ ఆహ్వానించామని, సమయం దొరికితే సమావేశంలో ఆయన కూడా పాల్గొనే ఆస్కారం ఉందని తెలిపారు. ఆ సమావేశంలో కుల గణనకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాంధీ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో ఏం జరుగుతున్నది అన్న దానిపై వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం ప్రధాని మోదీ ఎన్నడూ చేయలేదు. దానికి భిన్నంగా.. వాస్తవాలను తెలియాలని కోరుకునే వ్యక్తి రాహుల్‌గాంధీ. అందుకే కుల గణనపై కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించారు. దీనినిబట్టే కుల గణనపై ఆయన చిత్తశుద్ధి స్పష్టమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. అలాగే, కుల గణనపై టీపీసీసీ తరపున ఈనెల 6 లేదా 7న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, నాయకుల సూచనలు, సలహాలను తీసుకుని వాటిలో సహేతుకంగా ఉన్నవి స్వీకరిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ సహేతుకంగా, సజావుగా, ఎక్కడా బ్రేక్ రాకుండా జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు.
పథకాల అమలు తీరు పర్యవేక్షణకు నియోజకవర్గానికో సమన్వయ కర్త
రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా కుల గణనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్వామి కావాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇందిరా భవన్‌లో కనెక్టింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నామన్నారు. ఈ సెంటర్ కుల గణనతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్న తీరును నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రజలకు ఏమైనా అనుమానాలుంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికో సమన్వయ కర్తను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది
రాష్ట్రానికి సీఎం ఉండగా.. కొత్త సీఎం అంటూ ఇతర పార్టీల వాళ్లు మాట్లాడితే దానికి తాము ఏం సమాధానం చెబుతామని మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఒక సదవకాశాన్ని ఇచ్చారని, దాన్ని వమ్ము చేయకుండా.. వారు కోరుకున్న విధంగా సీఎం, మంత్రులు ప్రజా పాలనను అందిస్తున్నారన్నారు. ఇక్కడ ఏకచ్ఛత్రాధిపత్య పాలన జరగట్లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని, ప్రభుత్వం సజావుగా నడుస్తోందని తెలిపారు. కాంగ్రె్‌సలో ఉండే ప్రజాస్వా మ్యం, స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని, బీజేపీలో అసలే ఉండదన్నారు. మహేశ్వర్ రెడ్డికి బీజేపీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా దక్కుతున్న గౌరవం ఏమిటో ఆయన ఆలోచించుకోవాలని హితవు పలికారు. ‘‘బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు కుర్చీ నే లేదు. మాకున్న సమాచారం ప్రకారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి, మహేశ్వర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది’’ అని పేర్కొన్నారు. గ్యారెంటీలకు సంబంధించి ఖర్గే వ్యాఖ్యలను వేరుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీసీల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. మూసీని ప్రక్షాళన చేయాలా.. వద్దా అన్న దానిపై బీఆర్‌ఎస్ నేతలకు స్పష్టత లేదన్నారు.