Share News

Rain: హైదరాబాద్‌లో జోరు వాన..

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:01 AM

పొద్దంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో మొదలై.. కొద్దిసేపటికే వాన జోరందుకుంది.

Rain: హైదరాబాద్‌లో జోరు వాన..

  • పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం

  • రోడ్లపై మోకాళ్లలోతు నిలిచిన నీరు

  • డబీర్‌పురా, సర్దార్‌మహల్లో 7 సెం.మీ

  • 2 రోజులు నగరానికి వర్ష సూచన

  • పలు జిల్లాల్లో మోస్తరు వాన

  • కడెం ప్రాజెక్టుకు మొదలైన వరద

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పొద్దంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం నాలుగు కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో మొదలై.. కొద్దిసేపటికే వాన జోరందుకుంది. ఒకటీ రెండు ప్రాంతాల్లో ఆరంభమై.. నిమిషాల వ్యవధిలోనే నగరమంతా విస్తరించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు వరద నిలిచి పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రాత్రి 8 గంటల వరకు డబీర్‌పురాలో అత్యధికంగా 7.1 సెం.మీ, సర్దార్‌మహల్‌లో 7 సెం.మీ వర్షం కురిసింది. అసి్‌ఫనగర్‌, గౌలిగూడ, బేగంబజార్‌ ప్రాంతాల్లో 6 సెం.మీ.కు పైగా.. నాంపల్లి, లంగర్‌హౌస్‌, అజంపురా, దూద్‌బౌలి, విజయనగర్‌ కాలనీ, అంబర్‌పేటలో 5 సెం.మీ.కు పైగా.. హయత్‌నగర్‌, నెహ్రూనగర్‌, ఎన్‌జీవో్‌సకాలనీ, కిషన్‌బాగ్‌లో 4 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది.


వనస్థలిపురంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మెహిదీపట్నం 11 కేవీ సాయిగార్డెన్‌ ఫీడర్‌ పరిధిలో భారీ వృక్షం పడటంతో విద్యుత్‌ తీగలు తెగిపోయి స్తంభం విరిగిపడింది. ఎర్రగడ్డ స్వర్ణ జయంతి ఫీడర్‌ పరిధిలో చెట్టు విరిగి కరెంటు తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విపత్తు నిర్వహణ బృందాలు పలు ప్రాంతాల్లో వరద నీటిని తొలగించాయి. కాగా, హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సోమ, మంగళవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు యెల్లో హెచ్చరిక జారీచేశారు.


పలు జిల్లాల్లో మోస్తరు వాన..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వాన కురిసింది. నిర్మల్‌ జిల్లాలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టుకు 2,900 క్యూసెక్కుల వరద వస్తోంది. యాదగిరిగుట్టలో సాయంత్రం అరగంట పాటు జోరు వాన పడింది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వాన కురిసింది. వాంకిడి మండలంలో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లిలో పెద్ద వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో భీమిని, దహెగాం మండలాలకు చెందిన 50 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఉమ్మడి కరీంనగర్‌, మంచిర్యాల, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది.

Updated Date - Jun 24 , 2024 | 04:02 AM