Share News

Rain Alert: మరో 5 రోజులు వానలు..!!

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:19 PM

దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో రాగాల 24గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Rain Alert: మరో 5 రోజులు వానలు..!!

దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో రాగాల 24గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ(బుధవారం) బలహీనపడినట్లు వాతావరణ శాఖ చెప్పింది.


రుతుపవన ద్రోణి జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతాల గుండా మధ్య బంగాళాఖాతం వరకూ అల్పపీడనం పయనిస్తూ సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇంకోవైపు ఈనెల 19న పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు..

ఏపీలోని కోస్తా ప్రాంతంలో ఇవాళ తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లా, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపట్నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక రాయలసీమ జిల్లాలోనూ ఇదే పరస్థితి నెలకొననుంది. సముద్రతీరం వెంట పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, హనుమకొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోనూ అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - Jul 17 , 2024 | 06:28 PM