అటవీ సంపదకు హాని కలగకుండా రాడార్ స్టేషన్ నిర్మాణం
ABN , Publish Date - Sep 23 , 2024 | 05:09 AM
దామగుండంలో 48 శాతం విస్తీర్ణాన్ని తూర్పు నౌకా దళ రాడార్ స్టేషన్ నిర్మాణానికి వినియోగిస్తుండగా మిగిలిన భూమిలో అటవీ సంపదకు ఎలాంటి హానీ కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు.
అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్
హైదరాబాద్, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): దామగుండంలో 48 శాతం విస్తీర్ణాన్ని తూర్పు నౌకా దళ రాడార్ స్టేషన్ నిర్మాణానికి వినియోగిస్తుండగా మిగిలిన భూమిలో అటవీ సంపదకు ఎలాంటి హానీ కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి 12 లక్షలకు పైగా వృక్షాలను తొలగిస్తున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఫారెస్ట్ అడ్వైజరీ అథారిటీ 1,93,562 చెట్లను మాత్రమే తొలగించనున్నట్టు స్పష్టం చేసిందన్నారు. వీటికి బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అడవుల్లోని 2,348 హెక్టార్లలో 17,55,070 చెట్లను అటవీ శాఖ పునరుద్ధరించనున్నదని పేర్కొన్నారు. స్టేషన్ నిర్మాణాలకు పోగా మిగిలిన స్థలాల్లో మొక్కలను పెంచే అవకాశముం దని తెలిపారు. రాడార్ స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు గ్రామ సభల ఆమోదం లభించిందని, షెడ్యూల్డ్ తెగలు, అడవి బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ నుంచి ఆమోదం లభించాకే పనులు ప్రారంభించనున్నట్టు వివరించారు. ఈ ప్రాజెక్టుకు భూ ేసకరణ కోసం కేంద్రం 2010 నుంచి చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందన్న వాదనలో నిజం లేదన్నారు. ఈ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని తరలిస్తున్నారనే వార్తలను డోబ్రియాల్ ఖండించారు.