Share News

Ram Mandir: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jan 23 , 2024 | 10:12 AM

వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తుల తరలించనుంది.

 Ram Mandir: పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తులను తరలించనుంది. దీనికి సంబంధించి బాధ్యులను కూడా నియమించింది.

వెయ్యి రైళ్లు

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైల్వేశాఖ వెయ్యి రైళ్లను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి నడిచే రైళ్లలో భక్తులను తరలించనుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులను తీసుకెళతారు. ఈ నెల 29వ తేదీ నుంచి భక్తులను తీసుకెళ్లే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. పార్లమెంట్ పరిధిలో 6 లేదా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని తీసుకెళతారు. పార్లమెంట్ స్థానం నుంచి 1400 మంది వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

1400 మంది తరలింపు

రైలుకు 20 బోగీలు ఉంటాయి. బోగికి ఒక బీజేపీ ఇంచార్జీ ఉంటారు. వారికి కావాల్సిన ఏర్పాట్లను చూస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైలులో సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జనాలను తీసుకెళతారు. కాజీపేట నుంచి వెళ్లే రైలులో నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్య వెళ్లడానికి 30 గంటల సమయం పడుతుంది. అక్కడ దర్శనం చేసుకుని, ఐదు రోజుల్లో తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు.

కలిసి వచ్చేనా..?

అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని ఎంపిక చేసుకుని తీసుకెళతారు. వారి ఖర్చులన్నీ బీజేపీ నేతలు భరిస్తారని తెలిసింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అయోధ్య పర్యటన తమకు కలిసి వస్తోందని కమలం పార్టీ ఆలోచిస్తోంది. ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి అయోధ్య టూర్‌ని అస్త్రంగా మార్చుకుంటుంది. ఆశించిన ఫలితం వస్తోందో లేదో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 10:19 AM