AV Ranganath: ఆ చెరువులపై నివేదిక ఇవ్వండి!
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:36 AM
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు.
కాలువల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఏవీ రంగనాథ్ ఆదేశం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాపులను పూర్తిస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. సోమవారం నానక్‌రాంగూడలోని తౌతోనికుంట, భగీరథమ్మ, నార్సింగ్ నెక్నాంపూర్ చెరువులు, మూసీ నదిని రంగనాథ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా చెరువుల ఆక్రమణ ఇంకా కొనసాగుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నానక్‌రాంగూడలో వరద నీటి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలు తొలగించాలని సూచించారు. నదిలో కొన్ని నిర్మాణ సంస్థలు మట్టి పోసినట్టు గుర్తించిన రంగనాథ్.. దానిని తొలగించాలని, బఫర్ జోన్‌లో మట్టి పోస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు వెళ్లే ప్రవాహ వ్యవస్థ మూసుకుపోవడంతో అపార్ట్‌మెంట్‌లోకి వరద నీరు చేరుతోందంటూ వచ్చిన ఫిర్యాదును పరిష్కరిస్తామని తెలిపారు.