Dasarathi Krishnamacharyulu: దాశరథి జయంత్యుత్సవాలను ఏడాదంతా జరపండి
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:12 AM
నిజాం నిరంకుశ పాలనపై అక్షరాల ‘అగ్నిధార’ను కురిపించిన కవి.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఈ నేల అస్తిత్వ గానాన్ని ఎలుగెత్తి చాటిన స్వాతంత్య్ర సమరయోధుడు..
ప్రభుత్వానికి కేవీ రమణాచారి విజ్ఞప్తి
ఆయన ఖైదీగా ఉన్న నిజామాబాద్ జైలును చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రావు
హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నిజాం నిరంకుశ పాలనపై అక్షరాల ‘అగ్నిధార’ను కురిపించిన కవి.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఈ నేల అస్తిత్వ గానాన్ని ఎలుగెత్తి చాటిన స్వాతంత్య్ర సమరయోధుడు.. అక్షర చైతన్య వారధి, పోరాటాల సారథి.. దాశరథి కృష్ణమాచార్య. ఆ తేజోమూర్తి శత జయంతి సంవత్సరం ఈ నెల 22 నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి సాహిత్య స్ఫూర్తిని స్మరించుకోవడంతో పాటు, ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఆయన గురించి ఈ తరానికి తెలియజేసేలా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ ప్రభుత్వ మాజీ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అలాగే.. దాశరథి ఖైదు అనుభవించిన నిజామాబాద్ జైలును చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం ఇంతవరకు ముందుకు సాగకపోవడం విచారకరమని.. ఆయన శతజయంతి సందర్భంగా అయినా, దీన్ని పూర్తిచేయాలని ప్రముఖ కవి ఆచార్య తంగెడ కిషన్‌రావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాశరథి విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ప్రతిష్ఠించడంతో పాటు ఏదైనా బహిరంగ ప్రదేశానికి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 నుంచి దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయానికి నాంది పలికిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ఏటా జూలై 22న సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న ఒక కవిని గుర్తించి, రవీంద్ర భారతి వేదికగా సత్కరించి దాశరథి సాహితీ పురస్కారంతో పాటు రూ. 1,01,116 నగదును అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా దాశరథి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలోనే ఆచార్య ఎన్.గోపీ అధ్యక్షతన అవార్డు ఎంపిక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ అవార్డుకు ఎంపికైన వ్యక్తి పేరును ప్రకటించనున్నారు.