Share News

Revenue Notices: ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులా?

ABN , Publish Date - Aug 30 , 2024 | 02:58 AM

ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో, బఫర్‌ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై.. దుర్గం చెరువు చుట్టూ ఉన్న కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Revenue Notices: ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులా?

  • నోటీసులు అందుకున్న వారి ఆందోళన

  • అన్ని అనుమతులతో

  • 25 ఏళ్ల క్రితమే ఇళ్లు కట్టుకున్నాం..

  • గతంలో ఇచ్చిన నోటీసులకు

  • సమాధానాలు ఇచ్చామని వెల్లడి

  • న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు

  • సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ

హైదరాబాద్‌ సిటీ/మియాపూర్‌, రాయదుర్గం, మాదాపూర్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో, బఫర్‌ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై.. దుర్గం చెరువు చుట్టూ ఉన్న కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇళ్ల గేట్లు, గోడలపై ‘ఎఫ్‌’ అనే అక్షరం.. బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలకు ‘బి’ అనే అక్షరం రాయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన 30 రోజుల్లోగా ఎఫ్‌టీఎల్‌ ఎన్‌క్రోచ్‌మెంట్‌ నిర్మాణాలను ఇంటి యజమానులే తొలగించాలని, లేని పక్షంలో తామే చర్యలు తీసుకుని కూల్చివేసే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొనడంపై ఆవేదన వెలిబుచ్చుతున్నారు.


ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులా? అని వాపోతున్నారు. 25 ఏళ్ల క్రితం తాము అన్ని అనుమతులూ తీసుకుని, లేఅవుట్‌ ప్రకారమే నిర్మాణాలు చేశామని.. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. 1974 ఇరిగేషన్‌, రెవెన్యూ రికార్డుల ప్రకారం.. గుట్టల బేగంపేట గ్రామంలో దుర్గం చెరువు విస్తీర్ణం 160.6 ఎకరాలుగా ఉంది. ఇక్కడ.. సర్వే నంబర్‌ 55 నుంచి 59 వరకు నెక్టార్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేశారు. అందులోని ఇళ్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని నోటీసులివ్వడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. చట్ట ప్రకారం.. ఇరిగేషన్‌ విభాగం చెరువు ఎఫ్‌టీఎల్‌ బౌండరీలను నిర్దేశించిన తర్వాతనే, తమ లే-అవుట్లకు అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేశామంటున్నారు.


సర్వే నంబర్‌ 49, 47 పార్ట్‌లో 20 ఏళ్ల క్రితమే కల్యాణినగర్‌ కాలనీ ఏర్పడిందని వారు పేర్కొన్నారు. 2015లో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు తమకు నోటీసులు ఇచ్చినప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పామని గుర్తుచేశారు. తమ ఇళ్లు శిఖం పట్టా భూముల పరిధిలోకి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, సీఎం రేవంత్‌ ప్రసంగం నేపథ్యంలో రాజకీయ కారణాలతోనే ఇప్పుడు ఈవ్యవహారం మరోసారి మొదటికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోతున్నారు.


  • 1999-2000 నడుమ..

దుర్గం చెరువు పై భాగం గుట్టలబేగంపేట పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో 1990-2000 నడుమ సర్వే నంబర్‌ 47 నుంచి 59 వరకు పలు కాలనీలకు లే-అవుట్లు వేశారు. ఆయా కాలనీల్లో ఇప్పటివరకూ 700 ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కావూరి హిల్స్‌, సాగర్‌ సొసైటీ, నెక్టార్‌ గార్డెన్‌, కల్యాణ్‌ నగర్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, సాయి సొసైటీ, అమర్‌ సొసైటీ కాలనీలాంటివి దీనికి ఆనుకుని ఉన్నాయి. ఇందులో 204 ఇళ్ల యజమానులకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇరిగేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల3న మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. అలాగే, చందానగర్‌లోని గంగారం పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 60 మందికి నోటీసులిచ్చారు.


అలాగే.. కూకట్‌పల్లి మండల పరిధిలోని అల్లాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 12 ఇళ్లకు, ప్రగతినగర్‌ అంబర్‌ చెరువు పరిధిలో 25 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ నడుమ కొన్ని వందల మంది తమకు నోటీసులు అందినట్టు చెబుతున్నారు. ఈ నెల 3న నోటీసులు అందుకున్న 77 మందిలో 90 శాతం పైగా కమర్షియల్‌ భవనాలు, అపార్టుమెంట్ల యజమానులున్నారు. వాటిలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు 86 శాతానికి పైగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో నోటీసులు అందుకున్న పలువురు కోర్టును ఆశ్రయించి అధికారులు ఇచ్చిన నోటీసులపై స్టే తీసుకున్నట్లు సమాచారం.


నిజానికి.. కల్యాణ్‌నగర్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, బృందావన్‌ కాలనీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, సాయి సొసైటీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, కావూరి హిల్స్‌ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఎఫ్‌టీఎల్‌ సమస్యపై ఈ ఏడాది మార్చి 22న హైకోర్టును ఆశ్రయించాయి. తాము చట్టప్రకారమే నిర్మాణాలు చేసుకున్నామని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.


అయితే 2000 సంవత్సరంలో నగరంలో వచ్చిన వరదల నేపథ్యంలో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ను డీమార్కేషన్‌ చేశారని ఆయా సొసైటీలవారు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌ 1974 నాటి రికార్డుల్లోని ఎఫ్‌టీఎల్‌ ప్రకారం చర్యలు చేపడుతుండగా.. రెవెన్యూ అధికారులు తమ విషయంలో దాన్ని పట్టించుకోకుండా.. 2000 నాటికే అక్కడ ఉన్నవారిని పట్టించుకోకుండా నోటీసులు ఇచ్చి వేదిస్తున్నారని వాపోతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు.


ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట

  • హరిజన బస్తీలో 125 ఇళ్లకు నోటీసులు

  • వారంలో ఖాళీ చేయాలని ఆదేశాలు..

  • బస్తీ వాసుల్లో ఆందోళన

ఓల్డు బోయినపల్లి, ఆగష్టు 29 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌ చెరువు పరిధిలో కట్టుకున్న ఇళ్లను వారంరోజుల్లో ఖాళీచేయాలంటూ.. ఓల్డు బోయినపల్లి హస్మత్‌పేట హరిజన బస్తీలోని 125 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఏంచేయాలో పాలుపోక వారంతా ఆందోళన చెందుతున్నారు. నోటీసులిచ్చిన వారంలో ఖాళీ చేయాలంటే తామంతా ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని వాపోతున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని.. ఊళ్లో తమ పొలాలు అమ్ముకుని 30, 50, 60, 70 గజాల స్థలాల్లో తమ తాహతును బట్టి ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నామని వారు తెలిపారు.


అక్కడ 70 ఏండ్ల కిందట బోయిన్‌ చెరువు అనేది లేదని.. వ్యవసాయం కోసం మూడు బావులు ఉండేవని, ఆ బావులు నిండి చెరువుగా మారిందని బస్తీలో ఉన్న వృద్దులు కొందరు చెబుతున్నారు. ఆటోలు నడుపుకుంటూ.. ఇండ్లల్లో పని చేసుకుంటూ.. హమాలీ పని చేసుకుంటూ.. పైసా పైసా కూడబెట్టి, సరిపోక పోతే అప్పుచేసి స్థలాన్ని కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో తమ ఇండ్లను కూల్చి వేస్తామంటూ నోటీసులివ్వడం ఎంత వరకు న్యాయమని వారంతా వాపోతున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 02:58 AM