Share News

DS Chauhan: ఉగాది తర్వాతే సన్న బియ్యం!

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:29 AM

ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండుగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ..

DS Chauhan: ఉగాది తర్వాతే సన్న బియ్యం!

  • కొత్త ధాన్యం మిల్లింగ్‌తో భారీగా నూక శాతం

  • నాణ్యత తగ్గే ప్రమాదం.. ముద్దగా అన్నం

  • నిపుణుల సూచనతో సర్కారు పునరాలోచన

  • ధాన్యం తక్కువ వస్తుండడం.. మరో కారణం

హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండుగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. తాజాగా మూడు నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఖరీ్‌ఫలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్‌ చేస్తే... బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని, నాణ్యత లోపిస్తుందని నిపుణులు సూచించినట్లు ఆయన తెలిపారు. కనీసం మూడు నెలలపాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సన్న బియ్యాన్ని ఎస్‌పీఆర్‌జీల్లో (స్టేట్‌ పూల్‌ రిజర్వు గోడౌన్లలో)నిల్వ చేసి, మూడు నెలల తర్వాత ఉగాది నుంచి రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. సన్న బియ్యం పంపిణీ పథకానికి నెలకు 2లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరం. అంటే.. 36 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం పెద్దగా రావడం లేదు.


ఇప్పటి వరకు కేవలం 3 లక్షల టన్నులే వచ్చాయి. రైతులు బహిరంగ మార్కెట్లోనే సన్నాలను అమ్ముకుంటున్నారు. సీజన్‌ ప్రారంభంలో కొనుగోలు కేంద్రాలకు 50 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత 40 లక్షల టన్నులే వస్తుందని అంచనా వేసింది. తాజాగా 35లక్షల టన్నులు వస్తుందనే అంచనాతో ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో సన్నబియ్యం పంపిణీకి సరిపోయేలా ధాన్యం వస్తుందా? లేదా? అనే సందేహాలున్నాయి. ఒకవేళ లక్ష్యానికి అనుగుణంగా సన్న ధాన్యం రాకపోతే సన్న బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే... మళ్లీ టెండర్లు పిలవడం, రైస్‌మిల్లర్ల నుంచి ప్రొక్యూర్మెంట్‌ చేయటం వంటి పనులుంటాయి. ఈ కారణాల రీత్యానే సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం మూడు నెలల పాటు వాయిదా వేసిందనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఉగాది పండుగ రోజు (వచ్చే ఏడాది మార్చి 30)న పఽథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌ నెల కోటాలో సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Nov 19 , 2024 | 01:29 AM