Share News

Farmers: మిల్లర్ల మాయ

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:58 AM

వేలంపాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకున్న రైస్‌మిల్లర్లు.. ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు.

Farmers: మిల్లర్ల మాయ

  • కొనుగోళ్లలో ‘దొడ్డు’దారి.. బ్లాక్‌ మార్కెట్‌కు పంపిన ధాన్యం లోటు భర్తీకి పావులు

  • మిల్లుల్లో 12 లక్షల టన్నుల ధాన్యం షార్టేజ్‌

  • అమ్ముకున్న ధాన్యాన్ని అప్పగించకపోతే

  • 25ు జరిమానా విధిస్తామన్న ప్రభుత్వం

  • అప్పగింతకు డిసెంబరు 31 తుది గడువు

  • దీంతో రైతుల వద్ద తక్కువకే కొనుగోళ్లు

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వేలంపాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకున్న రైస్‌మిల్లర్లు.. ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు. మింగిన ధానాన్ని కక్కాల్సిందేనని, లేకపోతే 25 శాతం జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో.. ప్రస్తుత సీజన్‌లో వస్తున్న కొత్త ధాన్యంతో దానిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మాత్రమే బోనస్‌ ప్రకటించడంతో.. బోనస్‌ లేని దొడ్డు ధాన్యాన్ని తక్కువ ధరకే ఫామ్‌గేట్‌లో కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందనే సాకుతో కనీస మద్దతు ధర కూడా చెల్లించడంలేదు. క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,100 మించి ధర పెట్టడంలేదు.


ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, శుద్ధిచేయడం, 17 శాతానికి తేమ వచ్చేంతవరకు ఎదురుచూడటం ఎందుకనే ఉద్దేశంతో కొందరు రైతులు.. మిల్లర్లు అడిగిన ధరకు అమ్మేస్తున్నారు. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటలో విక్రయించిన విషయం తెలిసిందే. ఈ ధాన్యానికి క్వింటాలుకు రూ.2 వేల చొప్పున బిడ్డింగ్‌ ధర ఖరారైంది. టెండరు నిబంధనల ప్రకారం.. పే అండ్‌ లిఫ్టింగ్‌ సిస్టమ్‌ను అమలు చేయాలి. అంటే.. టెండర్‌ ఏజెన్సీలు ముందుగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే రిలీజింగ్‌ ఆర్డర్‌ (ఆర్వో) ఇస్తారు. ఆర్వోను రైస్‌మిల్లర్లకు పంపిస్తే.. వాళ్లు ధాన్యం అప్పగించాలి. ఇలా మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయించి రూ.7 వేల కోట్లు రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


  • 12 లక్షల టన్నుల ధాన్యం బ్లాక్‌ మార్కెట్‌కు..

ధాన్యం విక్రయం ద్వారా ప్రభుత్వం రికవరీ చేయాలనుకున్న మొత్తంలో ఇప్పటివరకు రూ.2,400 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. మొత్తం 35 లక్షల టన్నుల్లో.. ఇప్పటివరకు 12 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు ఏజెన్సీలకు అప్పగించారు. ఇంకా 23 లక్షల టన్నుల ధాన్యం అప్పగించాల్సి ఉంది. వీటికి సంబంధించి రూ.4,600 కోట్లు రావాల్సి ఉంది. కానీ, మిల్లర్ల వద్ద ఉండాల్సిన 23 లక్షల టన్నుల ధాన్యంలో.. 11 లక్షల టన్నుల వరకే మిల్లుల్లో నిల్వలున్నాయి. ఇంకా 12 లక్షల టన్నులను వారు బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రైస్‌మిల్లుల్లో జరిపిన తనిఖీల్లో ఈ మేరకు ధాన్యం షార్టేజ్‌ బయటపడింది. దీంతో ధాన్యాన్ని అమ్ముకున్న రైస్‌మిల్లర్ల వివరాలను ప్రభుత్వం సేకరించింది వారిపై నిఘా కూడా పెట్టింది.


ధాన్యం రికవరీకి టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌, డీఎ్‌సవోలు, జిల్లా మేనేజర్లతో ఒత్తిడి చేస్తోంది. టెండరు ధాన్యం అప్పగించేందుకు డిసెంబరు 31 తేదీని తుది గడువుగా ప్రభుత్వం విధించిందని, ఈ గడువు దాటితే 25 శాతం జరిమానా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు.. వేయి టన్నుల ధాన్యం బకాయిలున్న రైస్‌మిల్లరు గడువు లోపల చెల్లిస్తే వేయి టన్నులతో సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే 1,250 టన్నులను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే కొందరు అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్టు, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. టెండరు ధాన్యం లెక్కచూపని మిల్లర్లపైనా ఈ 3 అస్త్రాలు ప్రయోగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. దీంతో డిసెంబరు 31 తర్వాత జరిమానాలు, కేసులు ఎదుర్కోవడం కంటే.. ముందే జాగ్రత్త పడడం మంచిదన్న ఉద్దేశంతో మిల్లరు దొడ్డు ధాన్యం బాట పట్టారు. కానీ, ఈ క్రమంలో తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 03:58 AM