Share News

Robert Vadra: నా భార్య ప్రియాంకకు ఆల్‌ ది బెస్ట్‌

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:13 AM

తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్‌ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేయనుండటం సంతోషంగా ఉందని రాబర్ట్‌ వాద్రా అన్నారు.

Robert Vadra: నా భార్య ప్రియాంకకు ఆల్‌ ది బెస్ట్‌

  • ఆమె వయనాడ్‌ ఎంపీగా పోటీ చేయడం సంతోషంగా ఉంది

  • దేశంలో మహిళల భద్రత సమస్యగా మారింది: రాబర్ట్‌ వాద్రా

హైదరాబాద్‌, శంషాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్‌ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేయనుండటం సంతోషంగా ఉందని రాబర్ట్‌ వాద్రా అన్నారు. ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదారాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో ఆయనకు కాంగ్రెస్‌ నేతలు పూల మాలలు, బొకేలతో ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు.


తొలిరోజు ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో, ఓ హోటల్‌లో, పెద్దమ్మ ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తెలంగాణకు రాజకీయాల కోసం రాలేదని, అధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు, ప్రజలు చెప్పింది వినడానికి మాత్రమే వచ్చానన్నారు. దేశం సుభిక్షింగా ఉండాలనే భావనతో తాను ధార్మిక యాత్రలు చేస్తున్నానని.. ధార్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. తాను హైదరాబాద్‌లో బడే మసీదును కూడా సందర్శిస్తానని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా తాను దివ్యాంగులు, అంధులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.


ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పును మరో ఐదేళ్ల చూస్తామని చెప్పారు. కశ్మీర్‌, హరియాణ, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని, తన భార్య, కూతురు భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళన చెందుతుంటానని చెప్పారు. దేశంలోని మహిళలందరూ తామంతా భద్రంతా ఉన్నామని భావించే రోజులు రావాలన్నారు. మహిళలు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నప్పుడూ తాము సురక్షితంగా ఉన్నామనే భరోసా వారిలో కలిగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.


మహిళా రక్షణకు సంబంధించి తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లోనే నేర్పించాలని కోరారు. మహిళల భద్రతకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు అంతా ఒక్కటిగా ముందుకు కదలాలన్నారు. దేశంలోని సమస్యలను తాను, రాహుల్‌ గాంధీ ఒకే కోణంలో చూస్తున్నామని, ఒకే విషయం గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. కాంగ్రె్‌సలో మీరు పవర్‌సెంటర్‌ అవుతారా? అని విలేకరులు అడగ్గా.. తాను రాజకీయాల్లోకి రావాలా అనే అంశాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఎమర్జెన్సీ సినిమా మీద ప్రశ్నించగా.. అదో సినిమా మాత్రమేనన్నారు. భార్య, తల్లి, చెల్లెళ్లతో పాటు మహిళలందరినీ ఎలా గౌరవించాలి అన్నదానిపై సినిమా రావాలని పేర్కొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 03:13 AM