Land Survey: భూ సర్వేతోనే భూ భారతికి కీర్తి
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:52 AM
కొత్త ఆర్వోఆర్-2024 చట్టంతో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నా.. అది అంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది.
ప్రతీ అంగుళం కొలిస్తేనే వివాదాలకు తెర.. సర్వే చేపట్టకుండా భూధార్ కార్డులు సవాలే
పార్ట్-బీ, నిషేధిత భూముల సంగతేంటి?
దశాబ్దాలుగా కార్యరూపం దాల్చని సర్వే
నిజాం కాలం నాటి రికార్డులే ఆధారం
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొత్త ఆర్వోఆర్-2024 చట్టంతో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నా.. అది అంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. భూముల రీ సర్వే చేయకుండా ఇప్పుడున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రీ సర్వే చేయకుండా పాత అంశాల చుట్టూ ఎన్ని మెరుగులు దిద్దినా ఉపయోగం ఉండదని పేర్కొంటున్నారు. ఆర్వోఆర్-2020 స్థానంలో భూభారతి పేరుతో ఆర్వోఆర్-2024ను తీసుకు రావడం.. కొత్త సీసాలో పాత సారానే అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భూ లావాదేవీల సమయంలో క్షేత్ర స్థాయి సర్వే, సబ్ డివిజన్ మ్యాప్‌లను తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో కాలక్రమేణా భూముల రీ సర్వే పూర్తవుతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. కానీ.. రీ సర్వే చేపట్టడం వెనుక ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? కేంద్రం నుంచి రీ సర్వేకు నిధులు అందినా ఎందుకు ముందుకెళ్లడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
80 ఏళ్లుగా ముందుకు పడని అడుగు
రాష్ట్రంలో సుమారు 80 ఏళ్లుగా భూముల రీ సర్వే జరగలేదు. నిజాం హయాంలో 1936-42 మధ్య సమగ్ర భూముల సర్వే జరగ్గా... హైదరాబాద్‌తోపాటు పట్టణాల్లో 1972లో టౌన్ సర్వే జరిగింది. ప్రతి భూమి పదేసి మంది చేతులు మారినప్పటికీ రికార్డుల నవీకరణ జరగలేదు. భూమి ఒకరి చేతుల్లో ఉంటే... రికార్డు మరొకరి చేతుల్లో ఉంది. చివరికి భూముల సరిహద్దు పత్రాలు(టిప్పన్‌లు) కూడా 75 ఏళ్ల కిందటివే. దాని ఫలితంగానే ఇప్పుడు సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. కన్ క్లూజివ్ టైటిల్ యాక్ట్ తెస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినా.. కార్యాచరణ మాత్రం చేపట్టలేదు. ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు కొన్ని ప్రయత్నాలు జరిగినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. వాస్తవానికి జాతీయ భూ రికార్డుల నవీకరణ పథకం కింద 2014లోనే తెలంగాణలో భూ సమగ్ర సర్వేకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి... రూ.83 కోట్ల విడుదల చేసింది. అయితే పదేళ్లుగా భూముల సర్వే దిశగా ప్రభుత్వం అడుగు పడలేదు. కేసీఆర్ హయాంలో అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బీఆర్ మీనా పలు దఫాలుగా భూముల సర్వేకు అనుమతి ఇవ్వాలని సీఎంవోను కోరినా సానుకూల స్పందన రాలేదు. 2016లో సర్వేకు సంబంధించిన సన్నాహకాలు పూర్తి చేసిన అప్పటి సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్... రెండేళ్లలో సర్వే పూర్తి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపైనా స్పందన కనిపించలేదు. ఓ దశలో కేంద్రం కూడా భూముల సర్వే చేయకపోతే నిధులను వెనక్కి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు పంపింది.
భూధార్ కార్డులతోనూ ఇబ్బందే
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఎంజాయ్‌మెంట్’ ఆధారంగా తాత్కాలిక భూధార్ కార్డులు ఇస్తామని చెబుతోంది. ఇదే జరిగితే కొత్త వివాదాలు తలేత్తే ప్రమాదం లేకపోలేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. 2019లో పొరుగు రాష్ట్రమైన ఏపీ... భూ సమగ్ర సర్వే చేపట్టి రెండేళ్లలో పూర్తి చేసింది. ఇందుకోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణలో 10,954 రెవెన్యూ గ్రామాల డిజిటల్ మ్యాపులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలోపు సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా సానుకూలత కనిపించడం లేదు. దేశంలో ఇప్పటికే గుజరాత్, త్రిపుర వంటి రాష్ర్టాల్లో సమగ్ర భూ సర్వే నిర్వహించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో భూములకు సంబంధించిన రికార్డుల ప్రక్షాళన, సర్వే కోసం ‘‘భూమి-కావేరి’’ పేరిట ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.
భూమిని అమ్మాలన్నా లేదా కొనాలన్నా అక్కడి అధికారులు తొలుత క్షేత్ర స్థాయి సర్వేను నిర్వహిస్తారు. ఈ సర్వేలో సదరు భూమి సర్వే నంబర్లలో ఉండి, రైతు పొజిషన్‌లో ఉన్నప్పుడే.. సరైన భూమిగా గుర్తించి, మ్యాప్‌తో సహా డిజిటలైజ్ చేస్తారు. ఆన్ లైన్‌లో డిజిటలైజ్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తాజాగాప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం-2024 ఆధారంగా భూమిని సర్వే చేశాకే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని ప్రతిపాదించింది. అయితే. ఇప్పటికే ఉన్న సరిహద్దు భూ వివాదాలను ఎలా పరిష్కరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ధరణి పార్ట్-బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు, సాదాబైనామా దరఖాస్తులకు, నిషేధిత జాబితాలో ఉండే భూములకు పరిష్కార మార్గాలు చూపుతామని ప్రభుత్వం భరోసా ఇస్తుండడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. సమగ్ర సర్వే చేయకుండా ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారనే దానిపై గందరగోళం నెలకొంది.
రాష్ట్రంలో భూముల సమాచారం
భూముల విస్తీర్ణం 2,45,05,758 ఎకరాలు
సర్వే నెంబర్లు 1,78,27,308
కమతాలు 75,54,137
మండలాలు 612
జిల్లాలు 33
రెవె న్యూ డివిజన్లు 73
సర్వేకు సిద్ధంగా నిధులు
జిల్లా యూనిట్‌గా సర్వే చేస్తే 16 నెలల్లో సర్వే పూర్తి చేయవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల సర్వేకు గ్రామీణ ప్రాంతాలకు రూ.400-450 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలో ప్రతిపాదనలు చేశారు. భూముల సర్వేకు కేంద్రం విడుదల చేసిన రూ.83 కోట్ల నిధులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూముల రీ సర్వే 90శాతం పూర్తయింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా సర్వే విభాగం దాదాపు 10 వేల రెవెన్యూ గ్రామాల మ్యాపులను డిజిటైజేషన్ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి 30 ఏళ్లకు ఒకసారి రెవెన్యూ రికార్డుల నవీకరణ జరగాలి. అప్పుడే ఏ భూమికి ఎవరు యాజమానులో తేలుతుందని, సమస్యలు పరిష్కారమవుతాయని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.