Share News

Sangareddy: ఎన్‌వోసీకి రూ.2.50 లక్షలు లంచం..

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:25 AM

నీటి పారుదల శాఖలో లంచావతారుల బాగోతం బట్టబయలైంది. ఒకే సారి ముగ్గురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. నాలా సమీపంలో భవన నిర్మాణానికి సంబంధించి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ.2.50లక్షలు డిమాండ్‌ చేసిన అధికారులు.. తొలుత రూ.1.50లక్ష తీసుకున్నారు.

Sangareddy: ఎన్‌వోసీకి రూ.2.50 లక్షలు లంచం..

  • నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి

  • దొరికిన ఇరిగేషన్‌ ఈఈ, ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌

సంగారెడ్డి క్రైం/హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల శాఖలో లంచావతారుల బాగోతం బట్టబయలైంది. ఒకే సారి ముగ్గురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. నాలా సమీపంలో భవన నిర్మాణానికి సంబంధించి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ.2.50లక్షలు డిమాండ్‌ చేసిన అధికారులు.. తొలుత రూ.1.50లక్ష తీసుకున్నారు. మిగతా రూ.లక్ష తీసుకుంటుండగా గురువారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే కేసులో గండిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్‌ గతంలోనే రూ.40వేలు తీసుకున్నట్లు తేలడంతో.. అతడినీ అదుపులోకి తీసుకున్నారు. మణికొండలోని నెక్నాంపూర్‌కు చెందిన బొమ్ము ఉపేంద్రనాఽథ్‌ రెడ్డి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు కార్తీక్‌, నిఖేశ్‌ కుమార్‌ను సంప్రదించారు.


నాలా సమీపంలో నిర్మించనున్న భవనానికి ఎన్‌వోసీ ఇవ్వాలంటే రూ.3లక్షలు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్‌ చేయగా.. రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఒప్పుకొన్నారు. ఈ మేరకు తొలుత రూ.1.50లక్షలను ముట్టజెప్పారు. మిగతా రూ.లక్ష కోసం అధికారులు వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) నార్త్‌ట్యాంక్‌ డివిజన్‌ కార్యాలయంలో గురువారం రాత్రి నిఘా పెట్టారు.


బాధితుడు ఉపేంద్రనాథ్‌ రెడ్డి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో ఉన్నతాధికారి సైతం ఈ కేసులో చిక్కాల్సి ఉండగా తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. ఇదే కేసులో గండిపేట ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న పి.గణేశ్‌ గతంలోనే రూ.40వేలు తీసుకున్నట్లు తేలడంతో, అతడినీ అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 01 , 2024 | 03:25 AM