Share News

Hiriya Nayak: అనారోగ్యం అంటే.. బెయిలొస్తుంది..!

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:46 AM

సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌ అస్వస్థతకు గురైతే.. సంకెళ్లు వేసి, ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది.

Hiriya Nayak: అనారోగ్యం అంటే.. బెయిలొస్తుంది..!

  • కొంప ముంచిన ఉచిత సలహా..!!.. ఎస్కార్టు కోసం.. ఠాణా పేరు తప్పుగా నమోదు

  • ఆదేశాల్లో బొంరా్‌సపేట్‌ బదులు బాలానగర్‌

  • లగచర్ల రైతుకు సంకెళ్ల ఘటనపై.. జైళ్ల శాఖ అంతర్గత విచారణలో వెల్లడి!!

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌ అస్వస్థతకు గురైతే.. సంకెళ్లు వేసి, ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది. సిబ్బంది ఉచిత సలహా, పరిపాలనాపరమైన అలసత్వం కారణంగానే ఇదంతా జరిగినట్లు విచారణలో తేలింది. విచారణ ఖైదీగా ఉన్న రైతుకు సంకెళ్లు వేసిన ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా.. సీనియర్‌ ఐజీ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి జైలు సందర్శించిన ఐజీ.. సిబ్బందిని విచారించి, నివేదికను రూపొందించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆ నివేదికలో పొందుపర్చిన అంశాలు ఇలా ఉన్నాయి. అనారోగ్య కారణాలతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే సులువుగా వచ్చే అవకాశం ఉంటుందని జైలు సిబ్బంది హీర్యా నాయక్‌కు ఉచిత సలహా ఇచ్చినట్లు తేలింది. ఆ క్రమంలోనే తనకు ఛాతీలో నొప్పిగా ఉందని హీర్యా నాయక్‌ అధికారులకు చెప్పడంతో.. ముందుగా జైలు ఆస్పత్రిలో చికిత్స అందించారు.


జైలు డాక్టర్‌ సూచన మేరకే బయట 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌ వైద్యుల పరీక్షలో ఏ సమస్యా లేదని తేలింది. మరోవైపు ఖైదీలకు ఎస్కార్టు విషయంలో జైలు సిబ్బంది రూపొందించిన లేఖలో పోలీ్‌సస్టేషన్‌ పేరు తప్పుగా దొర్లింది. అయితే ఆ రోజు సంగారెడ్డి జైలు నుంచి కొందరు ఖైదీలను కోర్టు విచారణకు తరలించారు. వరుస క్రమంలో హీర్యా నాయక్‌ పేరు చేర్చి, ఆస్పత్రికి తరలించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై లగచర్లలో దాడి జరిగిన ఘటనపై వికారాబాద్‌ జిల్లా బొంరా్‌సపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్కార్టు కోసం రాసిన లేఖలో బొంరా్‌సపేట్‌ ఠాణా పేరుకు బదులు తప్పుగా బాలానగర్‌ అని పేర్కొన్నారు. ఎస్కార్టు లేఖలో పోలీ్‌సస్టేషన్‌ పేరు తప్పుగా ఉన్న విషయాన్ని పాలనాపరమైన అలసత్వం కారణంతో గుర్తించలేదని విచారణలో తేలింది. మరో నిందితుడు జైలు ఫోన్‌ను ఉపయోగించి మాట్లాడిన అంశాలను విచారణాధికారులు పరిశీలించారు.


ఘటనకు సంబంధించిన మొత్తం వివరాలతో నివేదిక రూపొందించిన అధికారులు.. సోమవారం ఉదయం జైళ్ల శాఖ డీజీకి నివేదికను అందించనున్నారు. ఇప్పటికే జైలర్‌ను సస్పెండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు.. నివేదిక పరిశీలన అనంతరం అసలు తప్పిదానికి కారకులైన సిబ్బంది, అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు. జైలు సూపరింటెండెంట్‌ విషయంలో హోం శాఖ ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా.. విచారణ ఖైదీగా ఉన్న రైతుకు సంకెళ్లు వేయడంతోనే అసలు సమస్య తలెత్తింది. ఈ విషయంపైనా జైళ్ల శాఖ విచారణలో ప్రస్థావించారు. ఖైదీలకు సంకెళ్లు అనేది జైలు అధికారులకు సంబంధించిన అంశం కాదని, పూర్తిగా పోలీసుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జైళ్ల శాఖ అందించే నివేదిక మేరకు ఆ రోజు ఎస్కార్టుగా వ్యవహరించిన సిబ్బందిపైనా పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 15 , 2024 | 04:46 AM