Share News

Congress: కంటోన్మెంట్‌ హస్తగతం..

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:54 AM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత వంశీచంద్‌ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించా రు.

Congress: కంటోన్మెంట్‌ హస్తగతం..

  • కాంగ్రెస్‌ నుంచి శ్రీగణేశ్‌ గెలుపు

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత వంశీచంద్‌ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించా రు. ఈ విజయంతో కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో అడుగుపెట్టినట్లయింది. గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లోని 24 నియోజకవర్గాల్లో 16 స్థానాలను బీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది.


మిగతా వాటిలో ఏడు మజ్లిస్‌, ఒకటి బీజేపీ ఖాతాలో చేరాయి. కాంగ్రెస్‌ మాత్రం ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది. రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం కరువైంది. అయితే.. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడగానే బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత కారు ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నికల అనివార్యమైంది. ఇప్పుడు కంటోన్మెంట్‌ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలోకి రావడంతో.. కాంగ్రెస్‌ బలం రెండుకు పెరగ్గా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 14కు పడిపోయింది.


  • మూడో స్థానానికి బీఆర్‌ఎస్‌

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో సిటింగ్‌ బీఆర్‌ఎస్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత మూడోస్థానంలో నిలిచారు. గత ఎన్నికలో లాస్యనందిత 59,057 ఓట్లతో విజయం సాధించగా.. ఇప్పుడు నివేదితకు 34,462 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా కౌంటింగ్‌ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినట్లు ధ్రువపత్రం అందుకున్న శ్రీగణేశ్‌.. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jun 05 , 2024 | 04:54 AM