ACB Raids: శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. నిశితంగా పరిశీలిస్తే..?
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:32 PM
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు బయటపడ్డాయి. కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు బయటపడ్డాయి. కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు. కన్ఫెషన్ రిపోర్ట్‌లో బయటపడ్డ వివరాల ప్రకారం.. శివ బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్‌లకు అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నారు. నార్సింగిలోని ఒక కంపెనీకి చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి శివ బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి ఆయన క్లియరెన్స్ ఇచ్చారు. నార్సింగ్‌లోని ఎస్‌ఎస్‌వీ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వడానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ డిమాండ్ చేసిన రూ.10 కోట్లలో షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించారు. గత డిసెంబర్‌లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్‌కు ఆ కోటి రూపాయలు చేరాయి. జూబ్లీహిల్స్‌లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి మరి బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చారు.
అలాగే మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కూడా అరవింద్ కుమార్ కోటి రూపాయలు డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలంలోని మంకల్ వద్ద వర్టేక్స్ భూములకు సంబంధించిన వ్యవహరంలో యజమానులకు అరవింద్ కుమార్, బాలకృష్ణ ఫేవర్ చేశారు. ఫలితంగా వర్టేక్స్ హోమ్స్‌లో బహుమానంగా అరవింద్ కుమార్ పేరిట ఒక ప్లాట్‌ను రిజిష్ట్రర్ చేశారు. కాగా అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శివబాలకృష్ణ అక్రమార్జనతో ఇరు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, ఏడు ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లాను సంపాదించినట్లు తెలిపాయి. వీటి విలువ రూ.500 కోట్లుగా ఉంటుందని నిగ్గుతేల్చాయి. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని అంచనా. శివబాలకృష్ణ ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.