Share News

Mulugu: నెత్తురోడిన అడవి

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:34 AM

ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Mulugu: నెత్తురోడిన అడవి

  • ఏటూరునాగారంలో ఏడుగురు మావోయిస్టుల కాల్చివేత

  • ఆదివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌

  • నర్సంపేట ఏరియా, ఏటూరు నాగారం

  • డివిజన్‌ కార్యదర్శులు భద్రు, మధు మృతి

  • చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా

  • నిద్రిస్తున్న దళంపై పోలీసుల దాడి!?

  • ప్రతిఘటించలేక చెల్లాచెదురైన వైనం

  • మధుది పెద్దపల్లి, మిగతావారిది ఛత్తీస్‌గఢ్‌

ములుగు/ఏటూరునాగారం రూరల్‌, కోల్‌సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు ఒకరోజు ముందు మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మృతుల్లో ఓ మహిళ సహా.. నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్‌ మధు ఉన్నారు. వీరిలో మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్‌ కాగా.. మిగతా ఆరుగురు ఛత్తీ్‌సగఢ్‌ వారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం అభయారణ్యాన్ని గ్రేహౌండ్స్‌, స్పెషల్‌పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం 6.16 గంటల సమయంలో ఏటూరు నాగారం మండలం చెల్పాక-ఐలాపూర్‌ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో నక్సల్స్‌ ఉన్నట్లు గుర్తించారు.


ఇరువైపులా అరగంట పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోయిన కాసేపటికి.. పోలీసులు ఏడు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో భద్రు, మధుతోపాటు.. ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి దేవల్‌ అలియాస్‌ కర్ణాకర్‌, ముస్సాకి జమునలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురిని దళసభ్యులు జైసింగ్‌, కిశోర్‌, కామేశ్‌గా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, జీత్రీ, 303-రైఫిల్‌, ఇన్సాస్‌ తుపాకీ, ఎస్‌బీబీఎల్‌ గన్‌, సింగిల్‌షాట్‌ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం, మంగపేట తహసీల్దార్‌లు శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పలువురు మావోయిస్టులు తప్పించుకొని పారిపోయినట్లు భావిస్తున్న పోలీసులు.. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శబరీశ్‌ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. ఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగానే.. ఉదయం 11.47గంటలకు ఒకసారి, 11.49గంటలకు మరోసారి రెండేసి రౌండ్లు, మధ్యాహ్నం 12.14 గంటలకు మూడురౌండ్ల కాల్పులు జరిగాయి.


  • తప్పించుకోలేని స్థితిలో..

భద్రు దళం నిద్రలో ఉన్నప్పుడు పోలీసులు కాల్పు లు జరపగా వారు తూటాలకు బలైనట్లు సమాచారం. మృతదేహాలు పొదల్లో పడి ఉన్న తీరు.. కాళ్లకు బూట్లు/చెప్పులు లేకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందని పౌరహక్కుల నేతలు చెబుతున్నారు.


  • బూటకపు ఎన్‌కౌంటర్‌: పౌరహక్కుల సంఘం

ఏటూరునాగారంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయని, 16 మంది మావోయిస్టులు మరణించారని గుర్తుచేశారు. ఈ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌కు ముందు భద్రు దళానికి విషాహారం పెట్టారని ఆరోపించారు. స్పృహ కోల్పోయిన మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి, కాల్చి చంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, నిపుణులైన వైద్య బృందంతో హైదరాబాద్‌లో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణ కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఆరోపించారు.

31.jpg


  • మధుపై రూ.8 లక్షల రివార్డు

ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మల్ల య్య అలియాస్‌ మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌ గ్రామం. 1995లో.. 18 ఏళ్ల వయసులోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడిగా..ఆ తర్వాత ఛత్తీ్‌సగఢ్‌లో పనిచేశాడు. ఉత్తర తెలంగాణలో మావోయిస్టు పార్టీ విస్తరణ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే.. మధు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. స్థానికులూ పోల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. తెలంగాణ పోలీసులు గతంలోనే మధు తలపై రూ.8 లక్షల రివార్డును ప్రకటించారు.

Updated Date - Dec 02 , 2024 | 04:34 AM