Share News

Siddipet: ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:44 AM

తానిచ్చిన డబ్బును తిరిగివ్వమంటే చెప్పుతో కొట్టడమే కాక, అదే డబ్బు సుపారీగా ఇచ్చి చంపించేస్తానని తమ్ముడు బెదిరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Siddipet: ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

  • తమ్ముడి బెదిరింపులతో మనస్తాపం చెంది అఘాయిత్యం

సిద్దిపేట క్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తానిచ్చిన డబ్బును తిరిగివ్వమంటే చెప్పుతో కొట్టడమే కాక, అదే డబ్బు సుపారీగా ఇచ్చి చంపించేస్తానని తమ్ముడు బెదిరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటలో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనలో తేలు సత్యం(48), అతని కొడుకు అన్వేష్‌ నందన్‌(7), కూతురు త్రివన్న హాసిని (5) బలవన్మరణం పొందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన సత్యం, స్వరూప దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అనారోగ్యం వల్ల స్వరూప 2014లో మరణించగా సత్యం.. శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. సత్యం, శిరీష దంపతులకు అన్వేష్‌, హాసిని సంతానం. సత్యం తన ఇంటిని మొదటి భార్య పిల్లలకు రాసివ్వగా వారు ఆ ఇంట్లో ఉంటున్నారు. సత్యం, శిరీష దంపతులు మరొకరి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.


అలాగే సత్యం చదివించడంతో అతని సోదరుడు తేలు శ్రీనివాస్‌ ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల సత్యం ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల క్రితం శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లి.. తానిచ్చిన రూ.5.50లక్షలను తిరిగివ్వాలని, తనకు ఆస్తి రాసివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య మాటామాట పెరగ్గా శ్రీనివాస్‌ తన అన్నని చెప్పుతో కొట్టాడు. రెండ్రోజుల క్రితం సత్యం అతన్ని మళ్లీ కలవగా.. ‘‘నీకు డబ్బు ఇవ్వడం కాదు కదా.. అదే డబ్బు ఎవరికైనా ఇచ్చి నిన్నే చంపిస్తానని’’ బెదిరించాడు. సోదరుడి తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యం తన ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం స్థానిక చింతల్‌ చెరువు కట్టపై సత్యం ద్విచక్రవాహనం కనిపించడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. చెరువులో గాలించిన గజ ఈతగాళ్లు.. సత్యంతోపాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. సత్యం ద్విచక్రవాహనంలో సూసైడ్‌ నోట్‌తోపాటు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఉన్న అతని మొబైల్‌ను పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు శ్రీనివాస్‌ కారణమని సత్యం ఆ వీడియోలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Nov 11 , 2024 | 03:44 AM