Share News

SLBC canal: ఎస్ఎల్‌బీసీకి 2,200 కోట్లు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:54 AM

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం తవ్వకం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రీన్‌ చానెల్‌ ద్వారా రూ.2,200 కోట్ల నిధులు సమకూరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

SLBC canal: ఎస్ఎల్‌బీసీకి 2,200 కోట్లు..

  • గ్రీన్‌చానెల్‌ ద్వారా సమకూరుస్తాం

  • నాపై కోపంతోనే కేసీఆర్‌ నల్లగొండ అభివృద్ధిని అడ్డుకున్నారు: కోమటిరెడ్డి

తిప్పర్తి/హైదరాబాద్‌ సిటీ/ఖైరతాబాద్‌, జూలై 11: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం తవ్వకం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రీన్‌ చానెల్‌ ద్వారా రూ.2,200 కోట్ల నిధులు సమకూరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా తిప్పర్తితోపాటు, శిలార్‌మియాగూడెంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే.. నల్లగొండను అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుపుతామన్నారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తనపై ఉన్న కోపంతోనే కేసీఆర్‌ ఆనాడు నల్లగొండ అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. సీఎం రేవంత్‌ ఒక సోదరుడిలా కొడంగల్‌ తర్వాత నల్లగొండకే అధిక నిధులిస్తున్నారని వ్యాఖ్యానించారు.


ఇంజనీర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి

కొద్దిపాటి సాంకేతికత ఉన్న రోజుల్లో నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, రెండు, మూడేళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు నెర్రెలు బారుతున్న ఘటనలు చూస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దీనిపై ఇంజనీర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కార్యాలయంలో తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు నవాబ్‌అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన పీజీ శాస్ర్తి, ఎస్‌.చంద్రమౌళి, ఎస్‌.జశ్వంత్‌ కుమార్‌, ఎంఏ కరీం లకు నవాజ్‌ జంగ్‌ పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రాన్ని మార్చనున్నామని, మూసీని ఆధునీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. ఇంజనీర్స్‌ భవన్‌కు స్థలం కేటాయింమని ఇంజనీర్లు కోరగా.. సీఎంతో చర్చించి ఎకరా స్థలం కేటాయించేలా చూస్తామని హామీనిచ్చారు.

Updated Date - Jul 12 , 2024 | 03:54 AM