Share News

Nalgonda: సోషల్‌ మీడియా వసూళ్లు

ABN , Publish Date - May 20 , 2024 | 03:02 AM

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఆపి.. సోషల్‌ మీడియా పేరిట పాత్రికేయులుగా వ్యవహరిస్తున్న వారు అర్ధరాత్రి వేళ వసూళ్లకు దిగారు. రూ.4.50 లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షలు ఇచ్చినా.. మిగతా సొమ్ము కోసం పట్టుబట్టారు. దీంతో వాహనదారు పోలీసులను ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Nalgonda: సోషల్‌ మీడియా వసూళ్లు

  • ఆవులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి అర్ధరాత్రి హల్‌చల్‌

  • రూ.4.50 లక్షలు ఇవ్వకుంటే అంతుచూస్తామని హెచ్చరిక

  • రూ.2 లక్షలు ఇచ్చినప్పటికీ మిగతా సొమ్ముకూ డిమాండ్‌

  • పోలీసులను ఆశ్రయించిన అక్రమ రవాణాదారు

  • అదుపులో నలుగురు.. నల్లగొండ జిల్లాలో ఘటన

నల్లగొండ, మే 19: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఆపి.. సోషల్‌ మీడియా పేరిట పాత్రికేయులుగా వ్యవహరిస్తున్న వారు అర్ధరాత్రి వేళ వసూళ్లకు దిగారు. రూ.4.50 లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షలు ఇచ్చినా.. మిగతా సొమ్ము కోసం పట్టుబట్టారు. దీంతో వాహనదారు పోలీసులను ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, అన్నవరం ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 32 వాహనాల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్న విషయం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని కొందరికి తెలిసింది. సాగర్‌- హైదరాబాద్‌ రాష్ట్ర రహదారిపై శనివారం అర్ధరాత్రి తర్వాత మాటువేశారు. అప్పటికే 25 వాహనాలు తరలిపోయాయి. మరో ఆరు వాహనాల డ్రైవర్లు విషయం తెలిసి కళ్లుగప్పి ఉడాయించారు. ఒక్క వాహనం డ్రైవర్‌ మాత్రం చింతపల్లి వైపు వెళ్లే ప్రయత్నం చేసి దొరుకుతామని భావించి లారీని వెనక్కు తిప్పాడు. కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ మీదుగా వెళ్లాలని భావించాడు.


అయితే, దీన్ని ‘కొండమల్లేపల్లి సోషల్‌ మీడియా’ పేరిట పాత్రికేయులుగా చెలామణీ అవుతున్నవారు, ప్రైవేట్‌ వ్యక్తులు సొమ్ము చేసుకోవాలని భావించారు. రూ.4.50 లక్షలు ఇవ్వకపోతే సోషల్‌ మీడియాలో పెట్టి అంతు చూస్తామని బెదిరించారు. 2 లక్షలు ఇచ్చినా వినకపోవడంతో అక్రమ రవాణాదారులు కొండమల్లేపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆదివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురు సోషల్‌ మీడియా పేరు చెప్పుకొంటున్న వ్యక్తులు కాగా, మరొకరు స్థానిక పశువుల సంతకు చెందిన వ్యక్తి అని తెలిసింది. వీరు ఇంకొందరి పేర్లను వెల్లడించినట్లు తెలిసింది. 12 మంది బృందంగా తయారై రోజూ రహదారిపై ఇదేవిధంగా బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.. మరోవైపు 32 వాహనాల్లో పశువులు అక్రమంగా తరలింపుపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఎస్‌ఐ రామ్మూర్తిని వివరణ కోరగా.. అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయమై విచారణ అనంతరం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవరకొండ మండలం పడమటిపల్లి వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Updated Date - May 20 , 2024 | 03:02 AM