Hyderabad: చిత్రపురి కేసుపై పోలీసుల సీరియస్
ABN , Publish Date - Jun 06 , 2024 | 04:56 AM
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల్లో నిందితులైన కమిటీలోని కొందరు సభ్యులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకోవడంతో పాటు ఆర్థిక నేరాల పరిశోధనా విభాగానికి బదలాయించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.
పరారీలో కమిటీ సభ్యులు
ఆర్థిక నేరాల పరిశోధనా విభాగానికి బదిలీ చేసే యోచన
రాయదుర్గం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల్లో నిందితులైన కమిటీలోని కొందరు సభ్యులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకోవడంతో పాటు ఆర్థిక నేరాల పరిశోధనా విభాగానికి బదలాయించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది. చిత్రపురిలో ఫ్లాట్ల కోసం సొసైటీకి డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. విచారణలో సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అక్రమాలు తేలడంతో గత నెలలో ఆయన్ను అరెస్టు చేశారు.
ఈ కేసులో అనేకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. చిత్రపురి కాలనీలో సుమారు 4300 ఫ్లాట్లు నిర్మాణం చేయగా, వాటిని సొసైటీలోని సభ్యులకు కేటాయించకుండా అక్రమంగా ఇతరులకు కేటాయించినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం సుమారు మూడు వందల మందిని అక్రమంగా సభ్యులుగా చేర్చుకుని వారి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ. 40 లక్షల మేర సుమారు రూ. 100 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లుగా తెలిసింది. ఓ వైపు సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గంలో వాటిని ఇతర ఖాతాలోకి తరలించడం, సొసైటీ ఖజానా ఖాళీ చేయడం చేశారు. అయితే నిందితుల నుంచి డబ్బులు రాబట్టి బాధితులకు న్యాయం చేయాలంటే మరింత లోతైన విచారణ చేయాల్సి ఉందని, అన్ని కోణాల్లో కేసును విచారించేందుకు ఆర్థిక నేరాల పరిశోధన విభానికి కేసును బదిలీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.