Hyderabad: ద.మ. రైల్వేకు 5 ఇంధన పరిరక్షణ అవార్డులు
ABN , Publish Date - Sep 14 , 2024 | 05:04 AM
అత్యుత్తమ ఇంధన నిర్వహణతో దక్షిణ మధ్య రైల్వే 5 ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకుంది.
రైల్ నిలయానికి ‘ఇంధన సామర్థ్యం’ అవార్డు
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అత్యుత్తమ ఇంధన నిర్వహణతో దక్షిణ మధ్య రైల్వే 5 ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో అవార్డులను ఉన్నతాధికారులు అందుకున్నారు. భవనాల విభాగంలో ద.మ. రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయానికి ‘ఇంధన సామర్థ్యం’ అవార్డు దక్కింది.
రైల్ నిలయానికి సంబంధించి 100% ఎల్‌ఈడీ లైట్లు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు, ఆధునిక లిఫ్టులు, స్టార్ రేటెడ్ ఏసీల ఏర్పాటు, సోలార్ వాటర్ హీటర్ల వినియోగం, విద్యుత్తు ఆదాకు టైమర్లు, ఆక్యుపెన్సీ సెన్సర్ల వాడకం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. ఇటు సికింద్రాబాద్‌లోని లేఖా భవన్, హైదరాబాద్ భవన్, మౌలాలిలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, లాలాగూడలోని క్యారేజ్ వర్క్‌షా్‌పనకు కూడా సీఐఐ అవార్డులు దక్కాయి. దీనిపై ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ.. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఐదు అవార్డులు రావడానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.