Share News

GDP: తెలంగాణ.. సంపన్న రాష్ట్రం!

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:48 AM

దేశ జీడీపీలో దాదాపు 30 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాటా 30 శాతంగా ఉంది.

GDP: తెలంగాణ.. సంపన్న రాష్ట్రం!

  • జాతీయ సగటు కంటే ఎక్కువ తలసరి

  • తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ

  • దేశ జీడీపీలో 30ు దక్షిణాది రాష్ట్రాల నుంచే..

  • ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశ జీడీపీలో దాదాపు 30 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాటా 30 శాతంగా ఉంది. ఈ విషయాలను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ రాష్ట్రాల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. జాతీయ సగటులో తెలంగాణ తలసరి ఆదాయం 193.6 శాతం ఉండగా, కర్ణాటక 181 శాతం, తమిళనాడు 171 శాతం, కేరళ 152.5 శాతం మేర ఉందని వివరించింది.


ఆర్థిక సరళీకరణ తర్వాత తెలంగాణ, కర్ణాటక బలమైన ఆర్థిక కేంద్రాలుగా మారాయని తెలిపింది. విభజన తర్వాత ఏపీ పరిస్థితి బాగా దెబ్బతిందని వెల్లడించింది. 2023-24లో తెలంగాణలో తలసరి ఆదాయం 193.6 శాతం మేర పెరగ్గా.. ఏపీలో 131.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. తలసరి ఆదాయం విషయంలో ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో సగటు వ్యక్తి జాతీయ సగటు కంటే 94 శాతం అధిక ఆదాయం ఆర్జిస్తుండగా.. కర్ణాటకలో 81 శాతం, తమిళనాడులో 71 శాతం ఆర్జిస్తున్నారని వివరించింది. తలసరి ఆదాయం రీత్యా ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా సంపన్న రాష్ట్రాలుగా గుర్తింపు పొందగా, బిహార్‌, ఝార్ఖండ్‌, యూపీ, మణిపూర్‌, అసోం పేద రాష్ట్రాలుగా ఉన్నట్లు నివేదిలో తెలిపింది.


పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ మంచి పనితీరు కనబర్చాయని, గోవా తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీ, హరియాణా మంచి పనితీరు కనబర్చగా, పంజాబ్‌ తలసరి ఆదాయం తగ్గుతూ వస్తోందని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి అధ్వానంగా ఉందని, 2023-24లో దాని వాటా జాతీయ జీడీపీలో కేవలం 5.6 శాతమని పేర్కొంది. తలసరి ఆదాయం విషయంలో ఒడిసా ఎంతో మెరుగుపడిందని, 2023-24లో 88.5 శాతానికి చేరుకుందని తెలిపింది. మధ్యప్రదేశ్‌ తలసరి ఆదాయం 2010-11లో 60.1 శాతం ఉండగా.. 2023-24లో 77.4 శాతానికి పెరిగిందని వివరించింది. అసోం తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతూ 73.7 శాతానికి చేరుకోగా, సిక్కిం తలసరి ఆదాయం గత రెండు దశాబ్దాల్లో చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ప్రశంసించింది.

Updated Date - Sep 19 , 2024 | 03:48 AM