Share News

Sports Quota: 152 పతకాలున్నా వర్తించని స్పోర్ట్స్‌ కోటా..

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:24 AM

క్రీడాకారుల అభ్యున్నతికి చేయూత ఇవ్వాల్సిన స్పోర్ట్స్‌ కోటా.. తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీవోఏ) నిర్లక్ష్యపూరిత వైఖరి, క్రీడా సంఘాల కుమ్ములాటల కారణంగా ప్రతిభగల క్రీడాలకు వర్తించని పరిస్థితి ఏర్పడింది.

Sports Quota: 152 పతకాలున్నా వర్తించని స్పోర్ట్స్‌ కోటా..

  • 18 ఏళ్ల యువ రోలర్‌ స్కేటర్‌కు దక్కని స్పోర్ట్స్‌ రిజర్వేషన్‌

  • ఆసియా చాంపియన్‌షి్‌పలో స్వర్ణం నెగ్గినా ఇంజనీరింగ్‌లో దొరకని సీటు

  • క్రీడా సంఘాల కుమ్ములాటలతో క్రీడాకారులకు అన్యాయం

  • టీవోఏ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రీడాకారుల అభ్యున్నతికి చేయూత ఇవ్వాల్సిన స్పోర్ట్స్‌ కోటా.. తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీవోఏ) నిర్లక్ష్యపూరిత వైఖరి, క్రీడా సంఘాల కుమ్ములాటల కారణంగా ప్రతిభగల క్రీడాలకు వర్తించని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, హ్యాండ్‌బాల్‌, ఫెన్సింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, బాక్సింగ్‌తో సహా పలు క్రీడా సంఘాల్లో నెలకొన్న వివాదాల కారణంగా క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటిలో కొన్ని సంఘాలకు రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ (శాట్జ్‌), ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపు లేకపోవడంతో వారికి అన్యాయం జరుగుతోంది. పడిగ తేజేశ్‌ అనే 18 ఏళ్ల యువ రోలర్‌ స్కేటర్‌ ఇప్పటివరకు వివిధ పోటీల్లో 152 పతకాలు సాధించాడు. ఇందులో ఐదు అంతర్జాతీయ, 26 జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గిన పతకాలున్నాయి. చైనాలో నిరుడు జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌ప సీనియర్‌ కేటగిరీలో రజతం సాధించాడు.


జీవో 2 ప్రకారం ఈ పతకం ఆధారంగా చూస్తే కౌన్సెలింగ్‌ ప్రాధాన్య క్రమంలో 35వ స్థానంలో ఉండాలి. అయితే, అసోసియేషన్‌కు గుర్తింపు లేని కారణంగా తేజేశ్‌ స్పోర్ట్స్‌ కోటాను కోల్పోవాల్సి వస్తోంది. వాస్తవానికి జీవో నంబర్‌ 2 ప్రకారం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఐఐఐటీ, ఐసెట్‌, ఈసెట్‌, లాసెట్‌ ఇలా అన్ని ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ 0.5 శాతం స్పోర్ట్స్‌ కోటా కింద సీట్లు కేటాయించాల్సి ఉంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గిన క్రీడాకారుల కష్టం సైతం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.


క్రీడా సంఘాల మధ్య వివాదాలను పరిష్కరించి, వాటికి గుర్తింపు ఇచ్చి, ప్రభుత్వానికి, క్రీడా సంఘాలకు మధ్య వారధిగా ఉండాల్సిన ఒలింపిక్‌ సంఘం పూర్తిగా కాడి వదిలేసి, తన గ్రూపు రాజకీయాల్లో నిమగ్నమై ఉందనే విమర్శలున్నాయి. ఏటా విద్యా ప్రవేశాల దగ్గరికి వచ్చేసరికి క్రీడా సంఘాల వివాదాల కారణంగా తేజేశ్‌ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 2019 నుంచి రోలర్‌ స్కేటింగ్‌కు గుర్తింపు లేకపోతే, ఈ విషయంపై క్రీడాకారులకు అవగాహన కల్పించాల్సిన టీవోఏ, శాట్జ్‌ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jul 30 , 2024 | 04:24 AM