Srisailam: శ్రీశైలంలో భక్తజన సందోహం..
ABN , Publish Date - May 20 , 2024 | 04:39 AM
శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు దీరారు.
రద్దీగా మారిన ఆలయ ప్రధాన వీధులు
ట్రాఫిక్ జామ్‌తో భక్తులకు ఇబ్బందులు
శ్రీశైలం, మే 19: శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు దీరారు. కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అధికారులు అల్పాహారం, తాగునీరు అందజేశారు.
దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు దర్శనం, ఆర్జిత సేవ క్యూలైన్లు, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. వేసవి సెలవులు, పైగా ఆదివారం.. దీంతో భక్తులు వేలాది వాహనాల్లో రావడంతో క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దేవస్థానం టోల్‌గేట్ సర్కిల్ వద్ద అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేట్ వద్ద నుంచి వచ్చిన వాహనాలను రింగ్ రోడ్డు వైపు మళ్లించాల్సి ఉంది. మరో వైపు రింగ్ రోడ్డు రెండో దారి నుంచి బయటకు తిరిగి వెళ్లే వాహనాలు కూడా టోల్‌గేట్ సమీపంలోనే నిలిచిపోయాయి. వచ్చి పోయే వాహనాలన్నీ ఒకే చోటకు చేరే సరికి ట్రాఫిక్ సమస్య నెలకొంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో దేవస్థానం సెక్యూరిటీ, హోంగార్డు సిబ్బందికి విఫలమయ్యారు.