Share News

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:07 AM

గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలు, మొబైల్‌ అప్లికేషన్లకు ఎస్‌డీసీనే ఆధారం.

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

  • రిజిస్ట్రేషన్‌, ధరణి సేవలు బంద్‌

  • మీసేవల్లోనూ నిలిచిన ఆన్‌లైన్‌ సర్వీసులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలు, మొబైల్‌ అప్లికేషన్లకు ఎస్‌డీసీనే ఆధారం. అయితే ఇందులో చిన్నపాటి సమస్యలు తలెత్తినా వెంటనే సరిదిద్దే అధికారులు గత పదిరోజులుగా సర్వర్‌ డౌన్‌ అయినా స్పందించకపోవడంతో పౌర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో జరిగే ధరణి లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. రోజుకు ఐదారు రిజిస్ట్రేషన్లు కూడా కష్టంగా అవుతున్నాయని, స్లాట్‌ బుక్‌ చేసినవారు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.


అటు మీసేవల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఐసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతున్నందున కులం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థులు దరఖాస్తులు చేయలేకపోతున్నారు. గనుల శాఖ, ఆర్టీఏ ఆన్‌లైన్‌ సేవలకూ అంతరాయం ఏర్పడింది. స్టేట్‌ డేటా సెంటర్లలో ఉన్న పలు క్లస్టర్లలో కొన్ని పూర్తిగా పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని సమాచారం. సమస్య పరిష్కరించాలంటూ ఐటీ శాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వ శాఖలు ఫిర్యాదు చేస్తున్నా.. స్పందన లేదు. ఈ విషయంపై ఎస్‌డీసీ ఇంచార్జిగా ఉన్న ఐటీ శాఖ ఇన్‌ఫ్రా జాయింట్‌ డైరెక్టర్‌ వేణుప్రసాద్‌ను సంప్రదించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.

Updated Date - Sep 20 , 2024 | 04:07 AM