Voter Lists: ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:16 AM
గ్రామ పంచాయతీల రెండో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఎటువంటి తప్పుల్లేకుండా సిద్ధం చేయాలని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు.
వచ్చే నెల 6న ముసాయిదా విడుదల
21న తుది జాబితాల ప్రచురణ
జిల్లాల అధికారులతో ఎస్ఈసీ పార్థసారథి
హైదరాబాద్, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల రెండో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఎటువంటి తప్పుల్లేకుండా సిద్ధం చేయాలని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ పురోగతిపై అందరు జిల్లా కలెక్టర్లు, (హైదరాబాద్ మినహా) స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజినల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో గురువారం ఎస్ఈసీ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకే్‌షకుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసీఐ (భారత ఎన్నికల సంఘం) తయారుచేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలను యథావిధిగా పరిగణలోకి తీసుకొని వార్డువారీ, గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో విడుదల చేయాలని ఆదేశించారు.
ఆతర్వాత మండల, జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు స్వీకరించాలన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో పొరపాట్లు జరిగితే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఫిర్యాదులను పరిశీలించి తుది ఓటరు జాబితాను వచ్చేనెల 21న ప్రచురించాలని ఆదేశించారు.
ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమపేర్లను పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా.. ఎమైనా అభ్యంతరాలు ఉన్నా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు చేర్పు, తొలగింపు జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో పరిగణలోకి తీసుకుంటారని వెల్లడించారు.
వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణపై మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం, సెంటర్ ఫర్గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ఆయన ఆవిష్కరించారు.