Kodangal: రెండు దశల్లో ‘కొడంగల్’ ఎత్తిపోతల
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:23 AM
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ పథకాన్ని నిర్మించనుంది.
రూ.4350 కోట్లతో నిర్మాణం.. త్వరలోనే టెండర్లు
చెరువుల నిల్వ సామర్థ్యం 4 టీఎంసీలకు పెంపు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ పథకాన్ని నిర్మించనుంది. తొలుత ఈ పథకం కింద ఉన్న చెరువుల నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలతో ప్రతిపాదించగా.. తాజాగా 4 టీఎంసీలకు పెంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదనల ప్రకారం భూత్పూరు జలాశయం నుంచి ఊట్కూరు చెరువు దాకా నీటిని ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువు దాకా నీటిని పంపింగ్ చేస్తారు. ఈ క్రమంలో ఊట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునికీకరణ, నీటి నిల్వ పెంచడానికి వీలుగా మొదటి దశ పనులకు రూ.2945 కోట్లు వెచ్చించనున్నారు.
ఇక రెండో దశలో జాజాపూర్, దౌలతాబాద్, బొమ్మరాసిపేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపడతారు. ఈ పనులకు రూ.1404.50 కోట్లు కావాలని అంచనా వేశారు. మక్తల్‌లో 25,783, నారాయణపేటలో 20,472, కొడంగల్‌లో 53,745 ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. దాంతో పాటు 0.38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. మొత్తం నిర్మాణ వ్యయం రూ.4350కోట్లుగా అంచనా వేశారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన 38 కిలోమీటర్ల మేర సొరంగాల తవ్వకాలకు కనీసం 4-5ఏళ్లు పడుతుంది. అందుకే సొరంగాలకు బదులు ప్రెషర్ మెయిన్‌ల ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.