Share News

Scheme: చేపపిల్లల పంపిణీకి 114 కోట్లు!

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:42 AM

ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేల నీటి వనరుల్లో... 86 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పోయాలని నిర్ణయించింది.

Scheme: చేపపిల్లల పంపిణీకి 114 కోట్లు!

  • 86 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు

  • ధరలు ఖరారు.. నోటిఫికేషన్‌ జారీ

  • టెండరు దాఖలుకు 23 దాకా గడువు

  • ఉచిత చేపపిల్లల పంపిణీకి 114 కోట్లు!

  • టెండరు బిడ్డింగ్‌ల దాఖలుకు ఈనెల 23 దాకా గడువు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేల నీటి వనరుల్లో... 86 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పోయాలని నిర్ణయించింది. చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి, మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనివ్వటానికి ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించేందుకు ఆదేశాలిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ పథకం అమలుచేయటానికి రూ.114 కోట్ల నిధులతో ప్రతిపాదనలు రూపొందించారు. చెరువులు, జలాశయాలు అన్నీకలిపి రాష్ట్రవ్యాప్తంగా 26 వేల వరకు ఉన్నాయి. మరింత వర్షాలు కురిసి, చెరువులు, ప్రాజెక్టులు నిండిన తర్వాత ఈ నీటివనరుల్లో చేప, రొయ్య పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్‌ ప్రియాంక.. ఈనెల పదో తేదీన టెండరు నోటిఫికేషన్‌ జారీచేశారు. టెండరు డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి ఈ నెల 20 తేదీ మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు. శుక్రవారం ప్రీ బిడ్డింగ్‌ సమావేశాన్ని మత్స్యశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించారు. టెండరు బిడ్ల దాఖలుకు ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 3గంటల వరకు గడువు ఇచ్చారు. 23వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు టెండర్ల స్వీకరణ ముగించి, తర్వాత అరగంటకు బిడ్డింగ్‌లు తెరుస్తారు. చేపపిల్లల టెండర్లను ఈ- ప్రొక్యూర్మెంట్‌ ప్లాట్‌ ఫామ్‌పై నిర్వహిస్తారు. టెండర్ల నిర్వహణ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా చేపట్టనున్నారు. కాగా రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్‌లో చేప పిల్లల ప్రతిపాదిత ధరను కూడా ఖరారుచేశారు.


35-40మి.మీ సైజులో ఉన్న చేప పిల్లలు 61పైసల చొప్పున, 80-100మి.మీ సైజులో ఉన్న చేపపిల్లలకు రూ.1.63 చొప్పున, రొయ్య పిల్లలకు రూ.2.34చొప్పున ధరను ప్రతిపాదించారు. రొయ్య పిల్లల టెండర్లను రాష్ట్రం యూనిట్‌గా మత్స్య శాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కాగా నిరుడు చేప పిల్లలు సరఫరా తాలూకు బకాయిలను అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం చెల్లించలేదు. 2023-24బడ్జెట్‌లో ఉచిత చేపపిల్లల పంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, సమకూర్చలేదు. దీంతో రూ.96.52 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 13 , 2024 | 03:42 AM