Hyderabad: మా సమస్యలపై సర్కారు ఆటలాడుతోంది..
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:09 AM
రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ (జూడా)లతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈ డాక్టర్ వాణి జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు.
సమ్మె కొనసాగిస్తాం: జూడాలు
సీఎం రేవంత్ స్పందించాలి
సమస్యలను పరిష్కరించాలి
లేదంటే అత్యవసర సేవలూ
నిలిపివేస్తామని హెచ్చరిక
హైదరాబాద్/సిటీ/అడ్డగుట్ట, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ (జూడా)లతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈ డాక్టర్ వాణి జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న జూడాలు.. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలపై సర్కారు ఆటలాడుతోందని, ప్రతిసారి మోసం చేస్తోందని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
లేదంటే అన్ని బోధనాస్పత్రుల్లో అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఓపీ, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ విధులను పూర్తిగా బహిష్కరించామని, ఒకటి రెండు రోజుల్లో అత్యవసర సేవలనూ నిలిపివేస్తామని తెలిపారు. గ్రీన్ చానల్‌తో సకాలంలో స్టైపెండ్‌ల విడుదల, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్‌లకు సరైన గౌరవ వేతనం, వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా సమస్యలను పరిష్కరించడం, హాస్టళ్ల సౌకర్యం కల్పించడం వంటి అంశాలను వెంటనే పరిష్కరించకుంటే సచివాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని జూడాలు వెల్లడించారు.
ప్రత్యామ్నయ ఏర్పాట్లలో వైద్యాధికారులు
హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూడాలు సోమవారం అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు రోజూ సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. జూడాల ఆందోళనతో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు పీజీ వైద్యులు చికిత్స చేస్తున్నారని, రోగులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమే్‌షరెడ్డి తమ ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల అధిపతుల (హెచ్‌వోడీ)తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రోగులను పర్యవేక్షించాలని, 24 గంటలు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.