Share News

Kaghaznagar: హాస్టల్‌ విద్యార్థులకు ఉడకని కిచిడి..

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:11 AM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్టీ ఆశ్రమోన్నత హాస్టల్‌లో శనివారం ఉడకని కిచిడి పెట్టడంతో దానిని తాము తినలేమంటూ విద్యార్థులు నిరసనకు దిగారు.

Kaghaznagar: హాస్టల్‌ విద్యార్థులకు ఉడకని కిచిడి..

  • తినలేమంటూ విద్యార్థుల నిరసన.. కాగజ్‌నగర్‌లో ఘటన

  • మధ్యాహ్న భోజనంలో పురుగులు

  • వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌సలో ఘటన

కాగజ్‌నగర్‌, దోమ/కులకచర్ల, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్టీ ఆశ్రమోన్నత హాస్టల్‌లో శనివారం ఉడకని కిచిడి పెట్టడంతో దానిని తాము తినలేమంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ విషయం బయటికి పొక్కడంతో హాస్టల్‌ సిబ్బంది ఉడకని కిచిడిని హాస్టల్‌ ప్రాంగణంలోనే పడేశారు. అరగంటలో మళ్లీ అన్నం వండారు. అయితే పప్పు ఉడకటం ఆలస్యమవుతుండటంతో అప్పటికే ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనె కలుపుకొని తిన్నారు. ఆ సమయంలో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఏటీడబ్ల్యూవో) ఖమర్‌, వార్డెన్‌ రాణి అక్కడే ఉన్నారు.


విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఎస్టీ ఆశ్రమోన్నత పాఠశాలకు వచ్చి సబ్‌ కలెక్టర్‌ శ్రద్దా శుక్లాకు సమాచారమిచ్చారు. ఆమె హాస్టల్‌కు చేరుకొని ఏటీడబ్ల్యూవో ఖమర్‌, వార్డెన్‌ రాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్‌లోని స్టాక్‌ను, వంట గదులను ఆమె పరిశీలించారు. ఇదిలా ఉండగా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించిన ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌సలో శనివారం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ప్రభు పాఠశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. నాసిరకం భోజనం వడ్డించే ఏజెన్సీ నిర్వాహకులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని, వంట నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Dec 22 , 2024 | 05:11 AM