Weather Change: ముసురుకున్న మేఘాలు!
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:21 AM
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
భూపాలపల్లిలో కొనుగోలు కేంద్రాల్లోనే
50 వేల టన్నుల ధాన్యం
సరిపడా టార్పాలిన్ కవర్లు లేక ఆందోళనలో రైతులు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్నిచోట్ల ముసురు పడగా.. చాలాచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. బుధవారం ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వానలు కురిశాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 3.3, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 2.1 ములుగు జిల్లా తాడ్వాయిలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచే ముసురు పడుతోంది. డోర్నకల్, చిన్నగూడూరు మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసి 15 రోజులు అవుతున్నప్పటికీ లారీలు రాకపోవడంతో తరలించలేదు.
దీంతో కొన్ని బస్తాలు తడిసిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో ఇంకా 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది. వర్షాలు పడుతుండటంతో సరిపడా టార్పాలిన్ కవర్లు లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల చేలల్లో పత్తి తడవడంతో ధర తగ్గే అవకాశముందని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తుంపర్ల వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలో వర్షం లేనప్పటికీ వాతావరణం చల్లబడింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్, పోచారం మునిసిపాలిటీల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. ఇక గురు, శుక్రవారాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 16-21 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.