Supreme Court: విద్యుత్ ఒప్పందల విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 17 , 2024 | 07:35 AM
విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ నర్సింహారెడ్డిని తప్పించండి
విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ
కమిషన్ చైర్మన్‌గా మరొకర్ని నియమించండి.. మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు
వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం.. వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం.. జస్టిస్ నర్సింహారెడ్డి రాజీనామా
వారంలో కొత్త చైర్మన్‌ను నియమిస్తామన్న సర్కారు.. కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్‌కు నిరాశే
అనుమానమే తప్ప సుప్రీం తప్పుపట్టలే
మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు
ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది
విలేకరులతో జస్టిస్ నర్సింహారెడ్డి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో అభిప్రాయాలను చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొకరిని వారం రోజుల్లో చైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది.
రికార్డుల్లో విషయాలేవీ చెప్పలేదు
విద్యుత్ కమిషన్ ఎక్కడా పరిధి దాటి ప్రవర్తించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ అన్నారు. విద్యుత్ ఒప్పందాలన్నీ నిబంధనల ప్రకారం జరిగితే మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరిగితే నష్టమేంటని ప్రశ్నించారు. ఏప్రిల్ 11న కేసీఆర్‌తో పాటు 25 మందికి కమిషన్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 30 వరకు కేసీఆర్ గడువు అడిగారన్నారు. జూన్ 15 వరకు కమిషన్ గడువు ఇచ్చిందన్నారు. కేవలం విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని మాత్రమే జస్టిస్ నరసింహారెడ్డి మీడియాకు చెప్పారని వెల్లడించారు.
విచారణ కమిషన్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కలుగజేసుకుని, కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని, అదనపు సమయం కోరారని మాత్రమే నరసింహారెడ్డి మీడియాకు చెప్పారన్నారు. రికార్డులో ఉన్న విషయాలేమీ మీడియాతో చర్చించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులన్నీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే, భద్రాద్రి మాత్రమే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారని సింఘ్వీ తెలిపారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని చెప్పారు. విచారణ చివరి దశలో ఉందని, మరికొన్ని రోజుల్లో అసలు వాస్తవాలేమిటో బహిర్గతం అవుతాయని సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అన్నారు. ఈ దశలో కమిషన్‌ను రద్దు చేయాలని కోరడం సరికాదని చెప్పారు.
కొత్త చైర్మన్‌తో, అవే విధివిధానాలతో కమిషన్ విచారణను యథాతథంగా కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో అసలు కమిషన్‌కు చట్టబద్ధత లేదని, కమిషన్ విచారణను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నరసింహారెడ్డి అప్పటికప్పుడు విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తనన్యాయవాది ద్వారా ఈ సమాచారాన్ని ఽప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి చేరవేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకోవడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని తీర్పులో ప్రస్తావిస్తూ ధర్మాసనం పిటిషన్‌పై విచారణను ముగించింది. మంగళవారం ధర్మాసనంలో విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాల వాదనల మధ్యలో జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశం ప్రస్తావన వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘న్యాయం జరిగినట్లు కనిపించాలి. ఆయన రహస్యంగా జరగాల్సిన విచారణ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. విచారణలో భాగంగా తన ముందుకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించారనే భావన ఉంది.
ఆయన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నాం. మరో జడ్జిని నియమించండి’’ అని జస్టిస్ చంద్రచూడ్ మధ్యాహ్న భోజన విరామానికి ముందు విచారణలో వ్యాఖ్యానించారు. ‘‘చెప్పిన విధానంలో పొరపాటు పక్షపాతానికి సంకేతం కాదు’’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. విచారణే పూర్తి కాకుండా కమిషన్ చైర్మన్ తన ముందుకు వచ్చిన అంశాల విషయ యోగ్యత(మెరిట్స్ ఆఫ్ ద మేటర్) మీద అభిప్రాయాలను వెల్లడించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘విధివిధానాలు పాటించామని చెప్పడం కోసం ఫలానా వారినికూడా విచారణకు పిలిచామన్నంత వరకు చెబితే సమస్యేలేదు. జడ్జిగా పనిచేసిన ఆయన స్థాయికి ఇది కొద్దిగా తగని వ్యవహారం.
తప్పొప్పులు ఎంచకుండా ఉంటే అసలు మేం జోక్యం చేసుకొనే వాళ్లమే కాదు. విచారణాంశంపై ఆయ న వ్యాఖ్యలు చేయడమే సమస్య. ఆయన వ్యాఖ్యలకు చట్టబద్ధత లేనప్పటికీ ఆ వ్యాఖ్యల తర్వాత విచారణ కమిషన్ నివేదిక తప్పకుండా ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉంటుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. చైర్మన్‌ను మార్చాలని ధర్మాసనం సూచించగా, విచారణ చివరి దశకు చేరిందని సింఘ్వీ విన్నవించారు. ఇన్ని రోజులు జరిగిన విచారణనే కొత్త చైర్మన్ కొనసాగిస్తారని ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. చైర్మన్‌గా మరొకరిని నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తున్నట్టు సీజేఐ తెలిపారు. భోజన విరామం తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా లేఖ కాపీని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ ధర్మాసనానికి అందజేశారు. దీంతో ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కమిషన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సోమవారం లోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలుపగా, ధర్మాసనం అంగీకరించింది. జస్టిస్ నర్సింహారెడ్డి గతంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
హైకోర్టులో ప్రతికూల తీర్పు
చట్ట విరుద్ధంగా కమిషన్‌ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంలో సవాల్ చేశారు. ఆ పిటిషన్ పై సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా సీనియర్ న్యాయవాది రాలేదని, పాస్ ఓవర్ కావాలని కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు కోరారు. మంగళవా రం జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్థార్థ్ లూథ్రా, కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుదీర్ఘ వాదనలు వినిపించారు.
కక్ష సాధింపే
విద్యుత్ కమిషన్ ఏర్పాటు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్తగా ఏర్పడిన ప్రభు త్వం మాజీ ముఖ్యమంత్రులపై కేసులు పెడుతోందని, ఇది సరికాదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తిగా చట్టబద్థంగా జరిగిందని చెప్పారు. అప్పటి మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే విద్యుత్ కొనుగోలు చేసినట్టు తెలిపారు. యూనిట్‌కు రూ.3.90 చొప్పున కొనుగోలు చేశామన్నారు. బహిరంగ వేలానికి ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, అత్యవసర సమయంలో అలా వెళ్లే అధికారం ప్రభుత్వానికి ఉందని బదులిచ్చారు. కమిషన్ నియామకమూ చట్ట ప్రకారం జరగలేదని చెప్పారు. ట్రైబ్యునళ్లు ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణకు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. చైర్మన్ తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. విచారణ పూర్తి కాకుండానే చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి, కేసీఆర్ తప్పు చేశారని తేల్చేశారని అన్నారు. విద్యుత్ కొన్నది, విద్యుత్ ప్లాంట్లకు సాంకేతిక పరిజ్ఞానం తీసుకున్నదీ ప్రభుత్వరంగ సంస్థల నుంచేనని గుర్తు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలని కోరారు. హైకోర్టులో పిటిషన్‌ను విచారించకుండానే కొట్టేశారన్నారు.