Share News

Supreme Court: మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంలో ఊరట

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:51 AM

మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో(యథాతథ స్థితి) విధించింది.

Supreme Court: మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంలో ఊరట

  • తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే

  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు

  • యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో(యథాతథ స్థితి) విధించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 2002లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌, రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఎస్‌ఎస్సీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఇన్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ అర్హతగా పేర్కొంటూ మెరిట్‌ జాబితాను సిద్ధం చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.


దీంతో అర్హత లేని 1200 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ 2012లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత బాధితులు తమకు న్యాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు తొలగించిన 1200 మందిని కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాల్లోకి తీసుకుంటూ 2013లో మరో జీవో జారీ చేసింది. అయితే, 2013లో కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ జీవో చట్ట విరుద్ధమని, కోర్టు తీర్పుల స్ఫూర్తికి అది వ్యతిరేకమని తీర్పులో హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, ప్రభుత్వం చేసిన తప్పే తామూ చేసినట్టు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 90 రోజుల్లో అర్హతతో కూడిన మరో జాబితాను సిద్ధం చేయాలని తీర్పులో ఆదేశించింది. హైకోర్టు తీర్పును బాధితులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

Updated Date - Dec 19 , 2024 | 04:51 AM