Share News

Supreme Court: కొన్ని వర్గాలకే భూ కేటాయింపా?

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:38 AM

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.

Supreme Court: కొన్ని వర్గాలకే  భూ కేటాయింపా?

  • అది రాజ్యాంగ వ్యతిరేకమే.. స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం

  • న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను

  • కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవోల రద్దు వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించిన 2005 నాటి జీవో(243, 244)లనే కాక, భూమి కేటాయించేందుకు 2008లో జారీ చేసిన జీవోలు 419, 420, 422 నుంచి 425లను కూడా రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం అంతిమ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద సమానత్వ హక్కును ఈ కేటాయింపులు ఉల్లంఘించాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు నేపథ్యంలో భూమి కేటాయింపులకోసం ఏర్పడిన సహకార సంఘాలు, వాటి సభ్యులకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుము సహా డిపాజిట్‌ చేసిన మొత్తం డబ్బునూ తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తంపై ఏ మేరకు వడ్డీ చెల్లించాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని, అయితే ఆ మొత్తం ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు నిర్ణయించే వడ్డీ రేట్లకు మించరాదని తేల్చింది. సహకార సంఘాలు, వాటి సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న లీజు ఒప్పందాలు కూడా రద్దయినట్లేనని ప్రకటించింది. సహకార సంఘాలు, సభ్యులు చెల్లించిన డెవల్‌పమెంట్‌ చార్జీలు, ఖర్చులను కూడా ఆదాయ పన్ను రిటర్నుల్లో సర్టిఫై చేసిన తర్వాత తిరిగి చెల్లించాలని తమ తీర్పులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాము వెనక్కు తీసుకున్న భూమిని ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. భూకేటాయింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సహకార సంఘాలు, వాటి సభ్యులు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ వర్గాలకు చెందిన వారికి భూకేటాయింపులపై కొన్ని విధివిధానాలను నిర్ణయిస్తూ 2010లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ అంతిమ తీర్పు వెలువరించింది.


  • ఇది వివక్షే..

తెలంగాణలో ప్రజావనరులను పంపిణీ చేయడంలో ప్రభుత్వ దాతృత్వ వైఖరిని వివక్షగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఇది పౌరులు, వారి హక్కులు, ప్రజాస్వామ్య పనితీరుపై చెప్పుకోదగిన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. ఒక ప్రైవేట్‌ వ్యక్తి మాదిరి తన ఇష్టం వచ్చిన నిబంధనలను ఏర్పరచుకుని.. ఇష్టం వచ్చిన వారితో ఒప్పందం కుదుర్చుకుని వనరులను పంపిణీ చేసేందుకు ఒక ప్రభుత్వానికి అధికారాలున్నాయా అనే ప్రశ్నపై సుప్రీం దృష్టి సారించింది. అలా చేయడానికి వీల్లేదని చెప్పేందుకు పలు తీర్పులను ఉటంకించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం ప్రజల ఆస్తులను, వనరులను పంపిణీ చేసే అధికారం తిరుగులేనిది కాదని, ఏ కేటాయింపులైనా ఆర్టికల్‌ 14ను దృష్టిలో ఉంచుకునే జరగాలని స్పష్టం చేసింది. ఆ లెక్కన చూస్తే ప్రభుత్వం జారీ చేసిన జీవోలేవీ రాజ్యాంగబద్ధంగా లేవని తేల్చింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా కోర్టులు ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసింది. భూములు కేటాయించేందుకు ఏ వర్గీకరణ చేసినా అది పక్షపాతంతో చేయరాదని, హేతుబద్దంగా ఉండాలని చెప్పింది. అణగారిన వర్గాలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో పోలిస్తే న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మెరుగైన స్థితిలోనే ఉన్నారని తెలిపింది.


  • సామాన్యుడికి నష్టం..

తమ ఇష్టం వచ్చిన వారికి విలువైన వనరులను అక్రమంగా పంపిణీ చేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. విస్తృత సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా వనరులను కేటాయించాలని, చట్టసభలు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ప్రజలకు ట్రస్టీలుగా వ్యవహరించాలని హితవు పలికింది. సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక కేటగిరీలుగా భావించి భూమిని తక్కువ ధరకు కేటాయించడం అసమానతల్ని శాశ్వతం చేస్తుందని పేర్కొంది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, నిష్పాక్షికత ప్రమాణాలకు ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. క్రీడలు, ఇతర కార్యకలాపాల ద్వారా దేశ ప్రగతికి తోడ్పడేవారికి హేతుబద్ధంగా, పక్షపాతం లేకుండా భూమి కేటాయించాలనుకున్నా అది ఆర్టికల్‌ 14 పరిధిలోనే జరగాలని తెలిపింది.


  • కేసు పూర్వాపరాలు

2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో భూకేటాయింపులకు సంబంధించి మూడు జీవోలను జారీ చేశారు. జీవో 242లో.. భూవనరులను నిర్వహించేందుకు, అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబఽంధించి సమగ్ర విధానాన్ని ప్రకటించారు. జీవో 243లో.. భూ కేటాయింపులకు అర్హులైన వ్యక్తుల కేటగిరీలను నిర్ధారించారు. జీవో 244లో.. ఈ కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకునే విధానాలను నిర్ణయించారు. జీవో నంబర్‌ 243 ప్రకారం.. భూమిని కేటాయించాల్సిన వారిని ఎనిమిది కేటగిరీలుగా నిర్ధారించారు. వారిలో 1) ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు 2) గుర్తింపు పొందిన, అక్రెడిటెడ్‌ జర్నలిస్టులు, 3) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులు, పంచాయతీరాజ్‌ టీచర్లు, 4) జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, సాంస్కృతిక రంగాల ప్రముఖులు 5) రక్షణ, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, 6) కార్గిల్‌, ఇతర యుద్ధాల్లో పాల్గొన్న సైనికులు, మావోయిస్టు హింసాకాండలో మరణించిన వారి వితంతువులు, 7) బలహీన వర్గాలు, 8) విద్య, దాతృత్వ, మత సంస్థలు. ఈ ఎనిమిది కేటగిరీల వారిలో మొదటి నాలుగు వర్గాల వారికీ భూమి కనీస విలువ ప్రకారం కేటాయించాలని.. 5, 8 కేటగిరీల వారికి మార్కెట్‌ విలువ ప్రకారం భూమి కేటాయించాలని.. 6వ కేటగిరీకి ఉచితంగా భూమి కేటాయించాలని.. 8వ కేటగిరీ విషయంలో ప్రభుత్వం తన విధానం ప్రకారం వ్యవహరించాలని జీవో తెలిపింది. ఎవరెవరికి ఎన్ని గజాలు కేటాయించాలో ఈ జీవోలో నిర్దేశించారు. భూమి కేటాయింపులకోసం ఆయా వర్గాలు సహకార సంఘాలుగా ఏర్పడాలని సూచించారు. ఈ జీవోలకు అనుగుణంగా 2006 మే 4న ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూమి పంపకాలను ప్రకటిస్తూ జీవో 522ను ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో 245 ఎకరాలు హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జర్నలిస్టులకు కేటాయించాలని జీవోలో పేర్కొంది.


హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, వివిధ రంగాల ప్రముఖులకు 500గజాల చొప్పున, మాజీ ఎమ్మెల్యేలు, వారి వితంతువులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు 300గజాల చొప్పున భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, దాదాపు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నామమాత్ర ధరలకు కేటాయించడం ఆర్టికల్‌ 14, 38, 39(డి)లకు వ్యతిరేకమని రావు వీబీజేచెలికాని, ఓఎం దేబరా 2006లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి పొందేవారిలో చాలామంది సంపన్నులేనని, వేలం లేకుండా భూమిని కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే భూమిని కేటాయించిన వారికి కూడా తిరిగి కేటాయిస్తూ జీవో 243ను సడలించడం దారుణమని వాదించారు. దీనిపై 2007అక్టోబరులో హైకోర్టు తీర్పు వెలువరించింది. కొన్ని వర్గాలకుఅక్రమంగా ప్రయోజనాలను కట్టబెట్టడాన్ని ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి స్పష్టమైన విధానాలుండాలని నిర్దేశించింది. ఈ తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పు చేర్పులతో మరో ఆరు జీవోలను జారీ చేసి భూ కేటాయింపులపై ముందడుగు వేసింది. దానిపై కూడా రావు చెలికానితో పాటు కేశవరావు జాదవ్‌, కాంపైన్‌ ఫర్‌ హౌజింగ్‌ అండ్‌ టెన్యురల్‌ రైట్స్‌ అనే సంస్థ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ జీవోలను కొట్టివేయాలని కోరారు. హైకోర్టు ఆ జీవోలను కొట్టి వేసి గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మళ్లీ తాజా కేటాయింపులు జరపాలని ఆదేశించింది.

Updated Date - Nov 26 , 2024 | 03:38 AM