Ganesh immersion: గణేశా.. ట్యాంక్‌బండ్ పిలిచె!
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:02 AM
గణనాథుల ‘నిమజ్జనం’పై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావు లేదని బెట్టు చేసిన ట్యాంక్‌బండ్ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది.
హుస్సేన్‌సాగర తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు
అధికారులు అనుమతివ్వకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే..
గణేశ్ ఉత్సవ సమితి హెచ్చరిక
ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీల తొలగింపు
దిగొచ్చిన అధికార యంత్రాంగం
ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 6 లక్షల మంది రాక
ట్రాఫిక్‌జాం.. సొమ్మసిల్లిన కొందరు
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గణనాథుల ‘నిమజ్జనం’పై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావు లేదని బెట్టు చేసిన ట్యాంక్‌బండ్ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది. ఈసారి కూడా మహా నిమజ్జనం ట్యాంక్‌బండ్ నుంచి ఆర్భాటంగా జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్‌బండ్ నుంచి నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. విగ్రహాలను నీళ్లలో వేయడానికి భారీ ఇనుప జాలీలు పెట్టిన అధికారగణం ఎట్టకేలకు దిగొచ్చింది.
అంతేనా.. ట్యాంక్‌బండ్ పైనుంచి నిమజ్జనం కోసం యుద్ధప్రాతిపదికన క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. మహా నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులకు కేక పుట్టించే పరిణామమిది. ఇదంతా గణేశ్ ఉత్సవ సమితి పోరాటం, హెచ్చరికల ఫలితమే!! ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఏడు క్రేన్లు అమర్చారు. సోమవారం మరో ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేస్తారు. ఇక.. ఎన్‌టీఆర్ మార్గ్‌లో తొమ్మిది, పీపుల్స్ ప్లాజా వద్ద ఏడు, జలవిహార్ సమీపంలో రెండు, సాగర్‌లోని బేబీ పాండ్ వద్ద మరో రెండు క్రేన్లు ఉన్నాయి. మొత్తంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 31 క్రేన్లు అందుబాటులో తేనున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
ట్యాంక్‌బండ్ పై నుంచి నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ ఈసారి కూడా జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాల అధికారులు హడావుడి చేశారు. అయితే ఎన్‌టీఆర్ మార్గ్ నుంచి నిమజ్జనం కోసం పరిమిత స్థాయిలో క్రేన్లు అమర్చారు. మంగళవారమే మహా నిమజ్జనోత్సవం కావడం.. ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు విధించడంతో ఎప్పటిలాగే గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు కదిలారు. ఆదివారం ఉదయం 9:30కు ట్యాంక్‌బండ్‌పైకి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అడ్డుగా పెట్టిన బారికేడ్లు, జాలీలు తొలగించారు. భక్తులను పిలిపించుకొని ట్యాంక్‌బండ్ నుంచి విగ్రహాలను నిమజ్జనం చేయించారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటలపాటు ఆ మార్గంలో ట్రాఫిక్ జాం అయింది.
ఆదివారం మధ్యాహ్నంలోపు నిమజ్జన ఏర్పాట్లు చేయకపోతే గనక సోమవారం నగరవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, నిమజ్జనానికి తరలించకుండా ఎక్కడి విగ్రహాలు అక్కడే ఉంచుతామని హెచ్చరించారు. ఏళ్లుగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని, కొత్త నిబంధనల పేరిట ఇబ్బంది పెట్టాలని చూడటం సబబు కాదన్నారు. 2022, 23లో కూడా ఇలానే చెప్పి.. చివరకు నిమజ్జన ఏర్పాట్లు చేశారని సమితి ప్రతినిధులు గుర్తు చేశారు. సమితి ప్రతినిధులు వెళ్లిన అనంతరం పోలీసులు తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి బారికేడ్లు అడ్డుగా పెట్టారు. విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వచ్చిన భక్తులు ఇతర మార్గాల వైపు పంపించారు. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో మధ్యాహ్నం నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు.. క్రేన్లు అమర్చేందుకు అనుమతినిచ్చారు. సాధారణంగా నిమజ్జనానికి మూడు, నాలుగు రోజుల ముందే సాగర తీరంలో క్రేన్ల ఏర్పాటు మొదలవుతుంది.
దారుస్సలాం ఎజెండా నడవదు సమితి ప్రతినిధులు
’భాగ్యనగరం మాది. వినాయకసాగర్‌లో నిమజ్జనం హిందువుల ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తీ ఆపలేదు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాన్ని ఆపాలని చూస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పేర్కొంది. సమితి రాష్ట్ర అధ్యక్షుడు జీ రాఘవరెడ్డి, కార్యదర్శి డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ.. దారుస్సలాం ఎజెండా ఇక్కడ నడవదన్నారు. తమ విశ్వాసాలను అవమానపర్చేందుకు ప్రభుత్వానికి ఎన్ని గుండెలు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంలో నిర్మించుకున్న వినాయక సాగర్‌లో 45 ఏళ్లుగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని, కోర్టు ఆదేశాల సాకుతో ప్రభుత్వ విభాగాలు రహస్య ఎజెండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దారుస్సలాం, నిజాంపాలన చట్టాలను గణేశ్ నిమజ్జన వేడుకల్లో అవలంబించొద్దని పేర్కొన్నారు.
మహా గణపతీ.. ఏం జన సంద్రమిదీ!
సెలవు రోజు ఖైరతాబాద్ గణేశ్ వద్ద కిటకిట
ఒక్కరోజే 6 లక్షలకు పైగా భక్తుల రాక
సొమ్మసిల్లిన కొందరు.. ట్రాఫిక్‌జాం
మేడ్చల్‌లో అపశ్రుతి.. యువకుడి మృతి
ఖైరతాబాద్, మేడ్చల్ సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): మహా నిమజ్జనోత్సవం సమీపిస్తుండటం.. సెలవు రోజూ కావడంతో ఆదివారం ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఆ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులను నియంత్రించలేక పోలీసులు ఒకదశలో చేతులెత్తేశారు. క్యూలైన్లలలో గంటలతరబడి నిల్చున్నవారిలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.. జనాల మధ్య చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కరయ్యారు.
మొత్తమ్మీద ఖైరతాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే దాదాపు 6లక్షలకు పైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. జనం రద్దీతో ఖైరతాబాద్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్‌జాం నెలకొంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది. కాగా మంగళవారం మహా నిమజ్జనం నేపథ్యంలో అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే ఖైరతాబాద్ స్టేషన్‌లో 30వేల ఎంట్రీలు, 55వేల ఎగ్జిట్లు జరిగాయని వెల్లడించారు. కాగా మల్కాజ్‌గిరి-మేడ్చల్ జిల్లా రాజబొల్లారం తండాలో నిమజ్జనంలో విషాదం జరిగింది. నిమజ్జనం చేస్తుండగా తండాకు చెందిన నరేందర్ (28) చెరువులో పడి చనిపోయాడు.