Share News

Hyderabad: సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:41 AM

ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ మరువలేనిదని, 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Hyderabad: సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు

  • ఉపాధ్యాయులకు పదోన్నతులతో 15ఏళ్ల సమస్యను తీర్చారని హర్షం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ మరువలేనిదని, 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఈ సందర్భంగా వారు కొన్ని సూచనలు చేశారు. రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ప్రతీ 4,5 మండలాలకు ఒక ఎడ్యుకేషన్‌ డివిజన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. డివిజనల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ పోస్టును మంజూరు చేసి ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాలన్నారు.


అలాగే మండలంలోని అన్ని ఉన్నత, ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ అధికారి స్థాయిలో ఒక మండల స్థాయి అధికారి పోస్టును క్రియేట్‌ చేయాలని కోరారు. సీఎంను రేవంత్‌ను కలిసిన వారిలో తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కరివేద మహిపాల్‌ రెడ్డి, అరికెల వెంకటేశం, జగదీశ్‌, నర్సింహులు, మహ్మద్‌ అబ్దుల్లా, రాజభాను చంద్రప్రకాశ్‌, రాజ గంగారెడ్డి, తుకారాం, మారెడ్డి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 1849 మంది పీఈటీలకు ఫిజికల్‌ డైరెక్టర్లు (పీడీలు)గా పదోన్నతులు కల్పించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం (పెటా టీఎస్‌) నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ మేరకు ఆదివారం సీఎంను మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. పోస్టుల అప్‌గ్రేడేషన్‌ ద్వారా కొందరు పదోన్నతులు పొందినప్పటికీ.. కొన్ని జిల్లాల్లో కొంతమందికి పదోన్నతులు రాలేదని సీఎంకు వివరించారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) విద్యార్హతలుండి ఆయా జిల్లాల్లో అప్‌గ్రేడేషన్‌ అయిన పోస్టులు ఉన్నందున అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని నాయకులు కోరారు. కాగా, దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:41 AM