Gulf Workers: గల్ఫ్ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
ABN , Publish Date - Sep 17 , 2024 | 02:32 AM
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.
2023 డిసెంబరు 7 తర్వాత మరణించినవారికి.. వారి పిల్లలకు గురుకులాల సీట్లలో ప్రాధాన్యం
బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, యూఏఈ, సౌదీలో పనిచేసేవారికి వర్తించేలా ఉత్తర్వులు జారీ
గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనానికి సలహా కమిటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనుంది. ఆయా దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సమస్యలపై అధ్యయనానికి ఒక సలహా కమిటీని కూడా ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గల్ఫ్ బాధితుల సమస్యలను వినేందుకు.. వారికోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనుంది.
అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల పిల్లలకు రాష్ట్రంలోని గురుకులాల్లో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వనుంది. గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ నాలుగు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో నం.205 జారీచేశారు. గల్ఫ్‌లో పనిచేస్తూ 7.12.2023 నుంచి.. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గల్ఫ్‌లో మరణించిన తెలంగాణ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ కారణంతో చనిపోయినా సరే.. వారి కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందిస్తారు.
ఇక.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సలహా కమిటీ.. గల్ఫ్ కార్మికుల సమస్యలపైన, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రగతిభవన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణికి అనుబంధంగా గల్ఫ్ బాధితుల సమస్యపై ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణిని నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ, ప్రణాళిక శాఖ, సంక్షేమ పాఠశాలల వ్యవహారం చూసే వివిధ విభాగాలు వీటిపై తదుపరి చర్యలు తీసుకుని, నిర్దిష్ట కాలంలో అమలుచేయాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు.గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు పరిహారం కోసం కొన్ని నెలలుగా ప్రయత్నాలుచేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.